HMPV Virus: హెచ్‌ఎంపీవీపై భయం వద్దు
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:38 AM
హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటానిమో వైరస్) అనే వైరస్ కరోనా మాదిరిగా చైనాలో విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.

రాష్ట్రంలో ఒక్క కేసు కూడా లేదు: వైద్య, ఆరోగ్య శాఖ
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటానిమో వైరస్) అనే వైరస్ కరోనా మాదిరిగా చైనాలో విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు హెచ్‌ఎంపీవీ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి శనివారం ఓ ప్రకటన జారీ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ.. శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యల వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసింది. ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారు తక్షణమే మాస్కులు ధరించాలని కోరింది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రద్దీ ఎక్కువుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. అస్వస్థతకు గురైన వారు ఇంటికి పరిమితమవ్వాలని కోరింది. కరచాలనాలు వద్దని, అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
చైనా వైరస్ సీజనల్ సమస్యే : కేంద్రం
హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తితో చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి సీజనల్ సమస్యేనని, ఆందోళన చెందాల్సినది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హెచ్‌ఎంపీవీ ముప్పుపై అంచనాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసె్‌స నేతృత్వంలో శనివారం ఓ కీలక సమావేశం జరిగింది. ఇన్‌ఫ్లూయెంజ వైరస్, ఆర్‌ఎస్వీ, హెచ్‌ఎంపీవీ వ్యాప్తి ఈ సీజన్‌లో చైనాలో సాధారణమేనని సమావేశంలో పాల్గొన్న బృందం తేల్చిందని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ చైనాలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని వెల్లడించింది.