New DGP Selection: కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:18 AM
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ఐపీఎస్ అధికారులను గుర్తించి వారి పేర్లను యూ నియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ)కి పంపనుంది.

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ .. యూపీఎస్సీకి అధికార్ల పేర్ల జాబితాను పంపించనున్న ప్రభుత్వం
రేసులో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, షికాగోయల్
ముగ్గురిని ఎంపిక చేయనున్న యూపీఎస్సీ
వారిలోంచి ఒకరు డీజీపీగా ఎంపిక
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ఐపీఎస్ అధికారులను గుర్తించి వారి పేర్లను యూ నియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ)కి పంపనుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. దానికి మూడు నెలల ముందు కొత్త డీజీపీ అర్హుల జాబితాను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపాల్సి ఉంది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాలను పాటించని రాష్ట్రాలపై కోర్టు ధిక్కారచర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియచేయాలని గత జనవరిలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చే సింది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బి హర్, ఓడిశా, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కొత్త డీజీపీ ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. సదరు మార్గదర్శకాల ప్రకారం.. పూర్తిస్థాయి డీజీపీ పదవికి కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ హోదాలో పనిచేసిన అనుభవం వంటి అర్హత లుం డాలి. రాష్ట్రంలో ప్రస్తుతం డీజీపీ హోదాలో దాదాపు ఏడుగురు అధికారులుఉన్నారు. పదవీ విరమణకు 6 నెలల సర్వీసు ఉన్న అధికారుల పేర్లు కూడా పంపొచ్చు. డీజీపీగా నియమితులైతే రెండేళ్లు ఆ పదవిలో ఉంటారు. రెండేళ్లకన్నా తక్కువ పదవీకాలం ఉంటే వారికి ఆ మేరకు ఎక్స్‌టెన్షన్ ఇస్తారు.
సీనియర్ అధికారుల పేర్ల పరిశీలన
కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలిస్తోంది. వీరిలో ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా 1990 బ్యాచ్ అధికారి. ఆయన వచ్చే డిసెంబర్‌లో రిటైరవుతారు. ఆ తర్వాత 1991 బ్యాచ్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు 2028 జూన్ వరకు సర్వీసు ఉంది. తర్వాత స్థానంలో 1994 బ్యాచ్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డికి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సర్వీసు ఉంది. ఆ తర్వాత స్థానంలో 1994 బ్యాచ్ అధికారి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రాకు 2027 డిసెంబర్ వరకు, 1994 బ్యాచ్ అధికారి, సీఐడీ డీజీ షికా గోయల్‌కు 2029 మార్చి వరకు సర్వీసు ఉంది. వీరి పేర్లను, సర్వీసు రికార్డును యూపీఎస్సీకి ప్రభుత్వం పంపుతుంది. వారిలోంచి ముగ్గుర్ని యూపీఎస్సీ ఎంపానల్ కమిటీ ఎంపిక చేసి.. ఆ లిస్టును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాల్సి ఉంటుంది.
పదేళ్లుగా ప్రభుత్వ సన్నిహితులకే పదవి
దాదాపు పదేళ్లుగా నిర్దేశిత విధానాన్ని తెలంగాణలో పాటించకపోవడంతో.. ప్రభుత్వ అధినేతలకు ఇష్టమైన వారే డీజీపీగా ఏళ్ల తరబడి కొనసాగారు. ప్రస్తుత డీజీపీ జితేందర్‌ను కూడా యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేయలేదు. సీనియారిటీ ప్రకారం రవిగుప్తా, ఆనంద్, శివధర్‌రెడ్డిల పేర్లతో యూపీఎస్సీ నుంచి ఫైనల్ లిస్టు వెనక్కి రావచ్చని పోలీసుశాఖలో ఊహగానాలు సాగుతున్నాయి. అయితే, పోలీసుశాఖలో ఉత్తరాది లాబీ బలంగా ఉన్నందున, ఊహించని విధంగా ఉత్తరాదికి చెందిన వారి పేర్లతో జాబితానే వచ్చినా ఆశ్చర్యం లేదని మాజీ పోలీసు ఉన్నతాధికారులు కొందరు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News