Ration Cards: అర్హులందరికీ..ఇళ్లు, కార్డులు

ABN, Publish Date - Jan 19 , 2025 | 04:03 AM

‘‘అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తాం. రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారులను చేరేవరకు ఈ పథకం ఉంటుంది.

Ration Cards: అర్హులందరికీ..ఇళ్లు, కార్డులు

21 నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు.. ప్రజాపాలనలో వచ్చినవీ పరిగణనలోకి

  • కులగణన ఆధారంగా.. తయారు చేసింది తుది జాబితా కాదు

  • ఇళ్లు, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

  • ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు

  • మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, పొంగులేటి

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తాం. రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారులను చేరేవరకు ఈ పథకం ఉంటుంది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు’’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. దాంతోపాటు.. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈ రెండు అంశాలతోపాటు.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామసభల నిర్వహణ తదితర అంశాలపై శనివారం వారు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్‌ కార్డుల లబ్థిదారుల ముసాయిదా జాబితా కులగణన(సామాజిక సర్వే) ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నాలు సంక్షేమ పథకాలకు ప్రతిష్ఠాత్మకంగా శ్రీకారం చుట్టబోతోంది. వాటిపై 21 నుంచి జరిగే గ్రామసభల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. అధికారులు ఆ ఉచ్చులో చిక్కుకోవద్దు. గ్రామసభల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను స్వీకరించాలి. ప్రజాపాలన సేవాకేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులను తీసుకోవాలి’’ అని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ప్రజాపాలన సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు.


ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారి జాబితాను, లేనివారి వివరాలను గ్రామసభల్లో ప్రదర్శించాలని సూచించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా అందిస్తామన్నారు. ‘‘వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలి. ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలి. కుటుంబంలోని మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తాం. ఇటీవల సమీప మునిసిపాలిటీల్లో కలిపిన 156 గ్రామాలకు సంబంధించిన 2023-24లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. కాగా, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగిరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. శనివారం ఆయన గంగిరెడ్డికి ఫోన్‌ చేసి, బోర్డును సాధించిన రైతులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 19 , 2025 | 04:03 AM