Share News

Vehicle Tracking: వాహనం ఆచూకీ ఇక పక్కా!

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:47 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

Vehicle Tracking: వాహనం ఆచూకీ ఇక పక్కా!

  • అన్ని రవాణా, ప్రయాణికుల వాహనాల్లో

  • ‘లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌’ పెట్టాల్సిందే!

  • మహిళా ప్రయాణికుల భద్రతకు భరోసా

  • కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ ప్రతిపాదన

  • అనుమతి రాగానే పూర్తిస్థాయిలో అమలు

  • డివైజ్‌ ఏర్పాటుకు రూ.10 వేల దాకా ఖర్చు

  • కొత్త వాటికి కంపెనీలే అమర్చేలా చర్యలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సర్కారు ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు ‘వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ (వీఎల్టీడీ)’లు తప్పనిసరి చేయనుంది. ఇకపై సరుకు రవాణాతోపాటు ప్రయాణికుల వాహనాలు తప్పనిసరిగా వీఎల్టీడీలను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుమతి కోరుతూ రవాణా శాఖ అధికారులు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వీఎల్టీడీ అమర్చడం వల్ల ఏ వాహనంలోనైనా అనుకోని ఘటనలు జరిగితే.. క్షణాల్లో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా వాహనం నంబరు, కనీసం చివరి నాలుగు అంకెలు చెప్పాలి. బాధితురాలు చెప్పే వాహనం నంబరు ఆధారంగా అది ఎక్కడ ఉంది? ఎటువైపు వెళ్తుందనేది గుర్తించి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి పట్టుకుంటారు.


భద్రతా చర్యల్లో భాగంగా అవసరమైతే ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అత్యవసర సమయంలో వీఎల్టీడీ అమర్చిన వాహనం కదలికలపై నిఘా ఉంచే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ప్రతి ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, గూడ్స్‌ వాహనాలతోపాటు ఇప్పటికే తిరుగుతున్న ఈ తరహా వాహనాలకు వీఎల్టీడీలను అమర్చనున్నారు. కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాత ఈ తరహా వాహనాల తయారీ కంపెనీలు, సరుకు రవాణా వాహనాల తయారీ సంస్థలే వీఎల్టీడీ అమర్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే వాడుకలో ఉన్న వాహనాల్లో వీఎల్టీడీ పరికరాన్ని అమర్చేందుకు సుమారు రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రజా భద్రతకు ఇది తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. కొత్త వాహనాలకు ఈ పరికరం లేకపోతే రిజిస్ట్రేషన్‌ నిలిపివేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరం లేనట్లు గుర్తిస్తే అలాంటి వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తారు. ‘‘వీఎల్టీడీ విధానం అమల్లోకి తేవడం వల్ల మహిళా ప్రయాణికుల భద్రతకు పూర్తి భరోసా ఏర్పడుతుంది. తెలంగాణతోపాటు మరో ఒకటి, రెండు రాష్ట్రాలు నూతన విధానం అమలుపై దృష్టి సారించాయి. మహిళా ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానం ఏర్పాటు చేస్తున్నాం. ఇదివరకే చట్టం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే సరిపోతుంది. నిర్వహణ నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి. ట్రాకింగ్‌ పరికరాలు అమర్చడం, నిర్వహణ అంశం ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. పూర్తిస్థాయిలో వాడుకలోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది’’ అని రవాణా శాఖ కీలక అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - Mar 01 , 2025 | 10:18 AM