Share News

Gachibowli Land: అవి ప్రభుత్వ భూములే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:35 AM

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఎన్నో ఏళ్లుగా అవి రెవెన్యూ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

Gachibowli Land: అవి ప్రభుత్వ భూములే..

  • ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లోనే కంచ గచ్చిబౌలి భూమి

  • అడవి అయి ఉంటే అటవీ శాఖ పరిధిలోనే ఉండేది

  • బీడుగా ఉండడంతోనే చెట్లు పెరిగి అడవిలా కనిపిస్తోంది

  • సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు.. రేపు విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఎన్నో ఏళ్లుగా అవి రెవెన్యూ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. న్యాయ వివాదం వల్ల ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ స్థలంలో చెట్లు పెరిగి, చూడడానికి అడవిలా కనిపిస్తోందని తెలిపింది. ఒకవేళ అది అడవి అయి ఉంటే.. అటవీ శాఖ పరిధిలోనే ఉండేదని, రెవెన్యూ పరిధిలో కాదని వివరించింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఈ నెల 3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ నుంచి ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకుని పరిశీలించింది. అనంతరం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వయంగా కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి ఈ నెల 16లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే సీఎస్‌ వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, అక్కడే చెరువు పక్కన తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఈనేపథ్యంలో సీఎస్‌ శాంతికుమారి నేతృత్వంలో పది మంది సీనియర్‌ అధికారుల బృందం శనివారం ఢిల్లీకి వచ్చింది. ఆదివారం వరకు అక్కడే ఉండి సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వితోపాటు మరికొందరితో సుదీర్ఘంగా చర్చించింది. తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.


ఖాళీగా ఉండటంతో చెట్లు పెరిగాయి

కంచ గచ్చిబౌలి భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి ఆ భూములతో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ’’అక్కడ ఉన్నది అటవీయేతర ప్రాంతమే. రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల్లో ఎక్కడా అది అటవీ భూమిగా నమోదు కాలేదు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి ఆ భూములను ఐఎంజీ భారత అనే సంస్థకు అప్పగించారు. కానీ సదరు సంస్థ ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో ఆ భూములను తర్వాతి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై ఐఎంజీ భారత కంపెనీకి చెందిన బిల్లీ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ భూమిపై న్యాయ వివాదం కొనసాగుతోంది. ఆ భూమి ప్రభుత్వానిదేనని ఇటీవల న్యాయస్థానం తేల్చింది. సుదీర్ఘకాలం ఖాళీగా ఉండటంతో ఆ భూముల్లో చెట్లు పెరిగాయే తప్ప ఆ భూములతో అటవీశాఖకుగానీ, హెచ్‌సీయూకుగానీ ఎటువంటి సంబంధం లేదు. అక్కడ నిబంధనల ప్రకారమే చెట్లను తొలగించాం. చట్టాలకు లోబడే వ్యవహరించాం. అక్కడ అనుమతి తీసుకోవాల్సిన చెట్లు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఆ చెట్ల జోలికి వెళ్లలేదు’’అని ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిసింది. ఇక కోర్టు సహాయకులు (అమికస్‌ క్యూరీ) లేవనెత్తిన ఐదు ప్రశ్నలకూ అందులో స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సుమోటో పిటిషన్‌తోపాటు ‘బీద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పైనా 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 05:35 AM