KTR: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:26 PM
KTR: ఫార్మూలా ఈ రేసు కేసు వ్యవహారంలో హైకోర్టు ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కీలక అంశాలు ప్రస్తావించారు. హెచ్ఎండీఏ పరిధికి మించి నగదు బదిలీ చేసిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 07: ఫార్ములా ఈ వ్యవహారం కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్... మంగళవారం తన ఆదేశాల్లో కీలక అంశాలను ప్రస్తావించారు. కేబినెట్ ఆమోదం, ఫైనాన్స్ క్లియరన్స్ లేకుండా నగదు ఫారెన్ కంపెనీకి వెళ్లడంపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక హెచ్‌ఎండీఏ.. తన పరిధికి మించి నగదును బదిలీ చేసిందన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నగదు చెల్లింపులు జరిగాయని చెబుతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ చెల్లింపుల వల్ల లబ్ది పొందింది ఎవరు అనే అంశంపై ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉందని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కేసులో ప్రైమాఫేసియా నిరుపణ అయిందన్నారు. దీంతో అంతిమ లబ్దిదారుడు ఎవరో బయటకు రావాల్సి ఉందని తన ఆదేశాల్లో జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ ధవే వాదిస్తూ.. ఈ వ్యవహారంలో అధికార దుర్వినియోగం జరగలేదన్నారు. ఆయన వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. అలాగే దవే ప్రస్తావించిన అంశాలు ఈ కేసుకు వర్తించవంటూ హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవని పేర్కొంది. అయితే.. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా ఈ కారు రేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా ఈఎఫ్ఓకు నిధులు బదలాయింపు.. అగ్రిమెంట్‌కు ముందే నిధులు చెల్లింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. ఆ క్రమంలో ఈ వ్యవహరంపై విచారణ జరపాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్ .. ఎలా ఉండబోతోంది?
ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ చేర్చింది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో విచారణలో భాగంగా జనవరి 6 వ తేదీ హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్.. తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు.
Also Read: భూకంపం: 95 మంది మృతి
అయితే ఈ విచారణలో పాల్గొనేందుకు న్యాయవాదికి అనుమతి లేదని అధికారులు స్ఫష్టం చేశారు. దీంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ సోమవారం ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఇదే కేసులో జనవరి 7వ తేదీన అంటే.. ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరారు. దీంతో జనవరి 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు సూచించింది.
2022, అక్టోబర్‌లో ఫార్మూలా ఈ కారు రేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఎఫ్ఓతో ఒప్పందం చేసుకుంది. సీజ్ 9, 10,11,12 రేసులను నిర్వహించాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం. అయితే 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 రేసులు జరిగాయి. సీజన్ 10 కి సంబంధించి ప్రమోటర్‌గా వ్యవహరించిన సంస్థ ముందుకు రావడంతో అంతకు ముందున్న త్రైపాక్షిక ఒప్పందం కాస్తా.. ద్వైపాక్షిక ఒప్పందంగా మారింది. ఇది నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకుందని ప్రభుత్వం వాదిస్తోంది.
For Telangana News And Telugu News