ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సహకరించండి

ABN, Publish Date - Jan 07 , 2025 | 03:38 AM

‘‘మనదేశం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధించాలన్న మీ లక్ష్యంలో భాగస్వామి అయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇందుకోసం తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించండి’’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీతో అన్నారు.

  • తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందించండి.. మీ లక్ష్యసాధనలో భాగమవుతాం

  • బందర్‌-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌హైవే, ప్రత్యేక రైల్వే లైన్‌,

  • రీజినల్‌ రింగ్‌ రైల్‌, మెట్రో రెండోదశ మంజూరు చేయండి

  • వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌ ఏర్పాటుకు అవకాశమివ్వండి

  • ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

  • చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

  • త్వరలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొనసాగాలి: బండి

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘మనదేశం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధించాలన్న మీ లక్ష్యంలో భాగస్వామి అయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. ఇందుకోసం తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించండి’’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీతో అన్నారు. ఏపీలోని బందర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌ వరకు ప్రత్యేక రైల్వేలైను, ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అత్యంత కీలకమని, ఈ రెండింటినీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగ్‌రోడ్డుతో పాటు రీజినల్‌ రింగ్‌ రైల్‌కు సహకరించాలన్నారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం కావాలని అన్నారు. సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న చర్లపల్లి టెర్మినల్‌ను పూర్తిచేసి ప్రారంభించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.


‘‘తెలంగాణలో పోర్టు లేదు. ఏపీలోని బందరు పోర్టు మాకు దగ్గర్లో ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతోపాటు ప్రత్యేక రైల్వేలైన్‌ అందుబాటులోకి వస్తే రవాణా సులభతరమవుతుంది. ఇక్కడ డ్రైపోర్టు కూడా ఏర్పాటు చేస్తే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి దోహదపడుతుంది. హైదరాబాద్‌ నుంచే 35 శాతం బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తి జరుగుతోంది. దీంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి కూడా తెలంగాణలో పుష్కలంగా అవకాశాలున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. సెమీ కండక్టర్‌ యూనిట్‌ను మంజూరు చేయండి. మరోవైపు 370 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డు లో భాగంగా 170 కిలోమీటర్లకు సంబంధించి టెండర్లు పిలిచారు. దీంతోపాటు రీజినల్‌ రింగ్‌ రైల్‌ కూడా అవసరం. రెండోదశ మెట్రో ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయు. వికారాబాద్‌-కృష్ణా రైల్వేలైన్‌నూ మంజూరు చేయండి’’ అని రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీని కోరారు.


ఆర్థిక ప్రగతికి రైల్వేల అభివృద్ధి కీలకం..

దేశ ఆర్థిక ప్రగతికి రైల్వేల అభివృద్ధి కీలకమని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుండడం అభినందనీయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రైల్వేరంగం వినూత్న అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో ఇది చరిత్రాత్మకమైన రోజు అన్నారు. తెలంగాణలో గడచిన పదేళ్లలో 346 కిలోమీటర్ల కొత్త లైన్లు నిర్మించినట్లు, 40 ఆర్వోబీలు పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌కు అత్యాధునిక సౌకర్యాలు కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా 1400 రైల్వేస్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేసినట్లు చెప్పారు. కాగా, అభివృద్ధిలో చర్లపల్లి టెర్మినల్‌ ట్రయల్‌ మాత్రమేనని, అసలు పండుగ ముందుందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఐదు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రూ.750 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇక రాష్ట్రంలో జాతీయ రహదారులకు కేంద్రం ఇప్పటివరకు రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.80 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని చెప్పారు. వరంగల్‌ రైల్వ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎ్‌సకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇక రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.26 వేల కోట్లు వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేస్తేనే అభివృద్ధి సాఽధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం రాబోయే రోజుల్లోనూ కొనసాగాలన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తించిన ప్రధాని మోదీ.. రైల్వే ప్రాజెక్టులకు పుష్కలంగా నిఽధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఒడిసా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌, తెలంగాణ ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 03:38 AM