కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఇండ్ల నిర్మాణాలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:09 AM
రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్యలో మధ్య తరగతి ప్రజలకు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మధ్య తరగతి ప్రజల కోసం టౌన్‌షి్‌పలు: మంత్రి పొంగులేటి హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రాజేష్ ధర్మానీతో భేటీ
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్యలో మధ్య తరగతి ప్రజలకు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కనీసం వంద ఎకరాల్లో ఈ టౌన్‌షి్‌పలను నిర్మించి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో కొత్త గృహ నిర్మాణ విధానాన్ని తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ, సాంకేతిక విద్యాశాఖల మంత్రి ఎస్.హెచ్. రాజేష్ ధర్మాని సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న గృహనిర్మాణ పథకాల గురించి మంత్రి పొంగులేటిని ఆయన అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి వివరించారు.