Mahesh Kumar Goud: వచ్చే నెల సూర్యాపేటకు రాహుల్
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:04 AM
ఏఐసీసీ పిలుపు మేరకు జైబాపు.. జైభీం.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో సంవిధాన్ బచావో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఇందులో రాహుల్‌గాంధీ పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.

దేశంలో కుల గణన చరిత్రాత్మకం
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
హైదరాబాద్‌లో పార్టీ బలోపేతంపై దృష్టి: మహేశ్‌గౌడ్
హైదరాబాద్,జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ పిలుపు మేరకు జైబాపు.. జైభీం.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో సంవిధాన్ బచావో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఇందులో రాహుల్‌గాంధీ పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరుల ఇష్టాగోష్ఠిలో మహే్‌షకుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వే.. స్వతంత్ర భారతదేశంలోనే చరిత్రాత్మకమని అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కులగణనను అడ్డుకోవాలని చూసినా విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 5న కులగణన నివేదిక మంత్రి మండలికి అందనుందని చెప్పారు. రిజర్వేషన్ పెంపుపై క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి సారించినట్టు చెప్పారు.
జీహెచ్‌ఎంసీలో అత్యధిక సీట్లు గెలిచి.. మేయర్ పీఠం కైౖవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ సమావేశం సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ నిరసన తెలపడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెచ్చిన నిధులు ఎన్ని?.. ప్రాజెక్టులు ఎన్ని? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మాదిరిగా హామీలు అమలు చేయకుండా వదిలి వేయమని, ఆలస్యమైనా ఒక్కొక్కటీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ముగ్గురి పేర్లతో అధిష్ఠానానికి నివేదిక పంపామని, రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్, సొంత నివాసంలో సీఎం సమీక్షలు చేస్తున్నారని, ఇందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల అధికారిక నివాసంలో సీఎం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని సూచిస్తున్నట్టు తెలిపారు. వైఎ్‌సఆర్‌కు ఉన్నంత మంది అభిమానులు మరెవ్వరికీ ఉండరన్నారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ సొమ్ము ఎంత? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన రుణమాఫీ సొమ్ము ఎంత? తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాజకీయ అస్థిత్వం కోసమే కేటీఆర్, హరీశ్‌రావు, కవిత విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.