Share News

గోవాడలో మళ్లీ ఆగిన క్రషింగ్‌

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:57 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ మరోసారి నిలిచిపోయింది. క్రషింగ్‌కు అవసరమైన ప్రెజర్‌ అందకపోవడంతో శనివారం అర్ధరాత్రి క్రషింగ్‌ నిలిచిపోయింది. నాలుగు రోజుల వ్యవధిలో ఫ్యాక్టరీ రెండు సార్లు ప్రక్రియ నిలిచిపోవడం గమనార్హం.

గోవాడలో మళ్లీ ఆగిన క్రషింగ్‌
క్రషింగ్‌ నిలిచిపోవడంతో యార్డులో ఉన్న చెరకు బండ్లు

- నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు అంతరాయం

చోడవరం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ మరోసారి నిలిచిపోయింది. క్రషింగ్‌కు అవసరమైన ప్రెజర్‌ అందకపోవడంతో శనివారం అర్ధరాత్రి క్రషింగ్‌ నిలిచిపోయింది. నాలుగు రోజుల వ్యవధిలో ఫ్యాక్టరీ రెండు సార్లు ప్రక్రియ నిలిచిపోవడం గమనార్హం.

ఫ్యాక్టరీలోని టర్బయిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున క్రషింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టర్బయిన్‌ మరమ్మతు పనులు చేపట్టిన యాజమాన్యం శుక్రవారం తెల్లవారుజామునకు సిద్ధం చేయగా, తిరిగి ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో శనివారం అర్ధరాత్రి నుంచి మరోసారి క్రషింగ్‌నకు బ్రేక్‌ పడింది. సీజన్‌ ప్రారంభం నుంచి వరుసగా ఒకదాని వెంట మరొకటిగా అవాంతరాలు తలెత్తుతుండడం, క్రషింగ్‌ ఆగుతూ నడుస్తూ ఉండడం సర్వసాధారణంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు క్రషింగ్‌ నిలిచిపోవడంతో అసలు ఈ సీజన్‌ సక్రమంగా పూర్తవుతుందా? అనే సందేహం రైతాంగంలో వ్యక్తమవుతోంది. క్రషింగ్‌ నిలిచిపోవడంతో రైతుల్లో అసహనం అంతకంతకు పెరిగిపోతున్నది. వరుస అంతరాయాలతో ఇటు యాజమాన్యానికి, అటు కార్మికులకు కూడా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కాటాల వద్ద, ఫ్యాక్టరీ వద్ద వందలాది చెరకు బండ్లు ఎండకు ఎండిపోతుండడం, ఇంకా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేయడానికి రైతులు పర్మిట్ల కోసం తిరుగుతుండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. మరో వంక తరచూ అంతరాయాలతో క్రషింగ్‌ నిలిచిపోతుండడంతో రైతుల ఆందోళనలతో గోవాడ వద్ద పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియక పోలీసు అధికారులు సైతం ఫ్యాక్టరీ క్రషింగ్‌ తీరుతెన్నులను సమీక్షిస్తున్నారు. క్రషింగ్‌కు నాలుగైదు రోజులు బ్రేక్‌ ఇచ్చి, ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి, క్రషింగ్‌ కొనసాగిస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Updated Date - Mar 17 , 2025 | 12:57 AM

News Hub