నెత్తురు చిందించి.. ఉక్కును సాధించి!
ABN , First Publish Date - 2021-02-07T08:02:29+05:30 IST
దశాబ్దాలు కొనసాగిన బ్రిటిష్ వలస పాలనకు తెరపడింది. 1947లో దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చింది. ఆ తర్వాత... కీలక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పంచ వర్ష ప్రణాళికల అమలు మొదలైంది.

- మాట ఇచ్చి మోసం చేసిన కేంద్రం.. పిడికిలెత్తిన ఆంధ్రుడు
- విశాఖ ఉక్కు కోసం ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనల వెల్లువ
- ఉక్కు పోరులో 32 మంది అమరులు
- ఏళ్ల తరబడి సాగిన పోరాటం
బిగిసిన పిడికిళ్లు... ఎలుగెత్తిన నినాదాలు... విరిగిన లాఠీలు... పేలిన తూటాలు! అదొక మహోద్యమం! ఆంధ్రుల పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన ఘట్టం! అదే... ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఉద్యమం! దీని ఫలితంగానే కేంద్రం దిగి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ‘ఉక్కు’ను ప్రసాదించింది. ఇప్పుడు... ఇన్ని దశాబ్దాల తర్వాత విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు మరోసారి పోరాడాల్సిన అవసరం కనిపిస్తోంది! విశాఖ ఉక్కు సాధించేందుకు నాడు జరిగిన పోరాటాలు, చేసిన త్యాగాలు నేటి తరానికి దాదాపుగా తెలియవు! ఆ స్ఫూర్తిని గుర్తు చేస్తూ
‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు... నేటి నుంచి!
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): దశాబ్దాలు కొనసాగిన బ్రిటిష్ వలస పాలనకు తెరపడింది. 1947లో దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చింది. ఆ తర్వాత... కీలక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పంచ వర్ష ప్రణాళికల అమలు మొదలైంది. దేశ నిర్మాణానికి కీలకమైన ‘ఉక్కు’ ఉత్పత్తిలోనూ సొంత కాళ్లపై నిలబడాలని భావించారు. అలా... నాలుగో పంచ వర్ష ప్రణాళిక నాటికి దేశంలో నాలుగు ఉక్కు కర్మాగారాలను స్థాపించారు. నాలుగోది... బొకారో స్టీల్ ఫ్యాక్టరీ. నిజానికి... అప్పుడే విశాఖ అంశం చర్చకు వచ్చింది. దేశంలో ఐదో ఉక్కు కర్మాగారాన్ని సముద్ర తీర ప్రాంతమైన విశాఖలో ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో పోర్టు, దాని సామర్థ్యం, ఇక్కడి సానుకూలతలపై నివేదిక సమర్పించింది. దేశంలో ఏర్పడబోయే ఐదో ఉక్కు కర్మాగారం విశాఖలోనే అని అప్పుడే అంతా భావించారు. విశాఖలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని 1963 ఏప్రిల్‌లో నాటి ఉక్కు శాఖా మంత్రి సి.సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఆ తరువాత నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి విశాఖ వచ్చినప్పుడు ఇదే విషయాన్ని వెల్లడించారు. ‘ఇక్కడో ఉక్కు కర్మాగారం పెట్టబోతున్నాం’ అని తీపి కబురు చెప్పారు.
ఆరు నెలల్లోనే...
‘విశాఖలోనే ఉక్కు’ అని స్వయంగా ప్రధాని ప్రకటించి ఆరు నెలలు తిరగకముందే ప్రతిపాదనలు మారిపోయాయి. ఆంధ్రకు అన్యాయం జరిగేలా జాతీయ స్థాయిలో రాజకీయాలు రంగ ప్రవేశం చేశాయి. కర్ణాటకలోని హోస్పేటలో ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని మరో ప్రకటన వెలువడింది. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. చివరికి... స్థల నిర్ణయంపై ‘ఆంగ్లో అమెరికన్’ కన్సార్షియం (నిపుణుల కమిటీ) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా విశాఖ వైపే మొగ్గు చూపింది. ‘‘15 లక్షల టన్నుల సామర్థ్యంగల కర్మాగారాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు రూ.2500 కోట్లు ఖర్చవుతుంది. విశాఖలో రూ.1,402 కోట్లకే నిర్మాణం పూర్తవుతుంది. సముద్ర తీరం ఉన్నందున ఎగుమతి, దిగుమతి ఖర్చులూ తగ్గుతాయి’’ అని 1965లో నిపుణుల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది.
ఆ తర్వాతా అంతే...
నిపుణుల కమిటీ చెప్పిన తర్వాత కూడా శషబిషలు పోలేదు. కేంద్రం తన మొండి వైఖరి వీడలేదు. విశాఖ ఉక్కుపై రకరకాల సాకులు చెప్పడం మొదలు పెట్టింది. ‘ఇంత అన్యాయమా!’ అని ఆంధ్రులు భగ్గుమన్నారు. నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. మెల్లగా రాష్ట్రమంతా వ్యాపించాయి. 1966 జూలై ఒకటో తేదీన నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేశారు. విశాఖలోనే ఉక్కు కర్మాగారం పెట్టాలంటూ దాదాపు గంటన్నర ప్రసంగించారు. ఇక్కడ పెడితే ప్రయోజనాలు ఏమిటో వివరించారు. ఆ తరువాత కూడా కేంద్రం స్పందించలేదు.
ఉద్యమ పథం...
ఉక్కుపై ఊరించి, ఆశ చూపి మాట తప్పిన కేంద్రంపై తెలుగు వారిలో ఆగ్రహం అంతకంతకు పెరిగింది. విశాఖలో విద్యార్థుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మొదలైన ఆందోళన... ఆ తరువాత ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర మెడికల్ కళాశాల, ఏవీఎన్ కళాశాల... ఇలా అనేక విద్యా సంస్థల్లోని విద్యార్థి సంఘాలు ఇందులో కీలకంగా వ్యవహరించాయి. రాష్ట్రవ్యాప్తంగా కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా జనం ‘ఉక్కు’ పిడికిలి బిగించారు. దాదాపు మూడు నెలలు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అప్పుడే ‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అనే నినాదం మిన్నంటింది. ఉద్యమం 1966 అక్టోబరు నాటికి తీవ్రరూపం దాల్చింది. అక్టోబరు 15న గుంటూరు జిల్లాకు చెందిన గాంధేయవాది అమృతరావు ఉక్కు కర్మాగారం కోసం విశాఖ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చే పట్టారు. 22న విద్యార్థులు సంఘీభావం ప్రకటించి, భారీ బహిరంగ సభ నిర్వహించారు. 24 విశాఖలోనే అఖిలపక్ష కమిటీ ఏర్పాటైంది. 27న నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.
అగ్గి రాజుకుంది...
విశాఖ ఉక్కు ఉద్యమంలో పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అంతా పాల్గొన్నారు. 27 అక్టోబరు 1996న మద్రాస్ వెళ్లే మెయిల్ రైలును ఉద్యమకారులు గోపాలపట్నంలో ఆపేశారు. ఈ వార్త రేడియోలో విన్న ప్రజలు గంటల వ్యవధిలోనే అనకాపల్లిలో మద్రాస్ నుంచి వచ్చే మెయిల్‌ని నిలిపేశారు. ఈ వార్తలు చెవిన పడగానే... రాష్ట్రంలో ఆందోళనకారులు ఎక్కడికక్కడ రైళ్లను ఆపివేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఆందోళనకారులు 35 రైల్వేస్టేషన్లను దహనం చేశారు. పది రైలుబోగీలకు నిప్పు పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. విశాఖలో ఆల్ ఇండియా రేడియోను, గ్రామాల్లో పోస్టాఫీసులను మూయించేశారు. టెలిఫోన్ వైర్లను ఎక్కడికక్కడ కత్తిరించేశారు. అంత జరిగినా కేంద్రం దిగిరాలేదు. పైగా... కఠిన వైఖరి అవలంబించింది.
పేలిన తూటాలు..
1966 నవంబరు... విశాఖ ఉక్కు ఉద్యమంలో నెత్తు రు చిందింది. విశాఖలో 3 వేల మందితో జరిగిన భారీ ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 9 మంది చనిపోయారు. అలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 మంది ప్రాణాలు వదిలారు. కాల్పులను నిరసిస్తూ నవంబరు 1న పత్తి శేషయ్య నిరాహార దీక్షకు కూర్చొన్నారు. నవంబరు 3 నాటికి అమృతరావు నిరాహార దీ క్ష మొదలుపెట్టి 20 రోజులు అయ్యాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆయన దీక్షను భగ్నం చేసింది. నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్వయంగా ఆయన చేత దీక్ష విరమింపచేశారు. పత్తి శేషయ్య నిరాహార దీక్ష కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల లాఠీచార్జీ లు, బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులు జరిగాయి. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం ప్రారంభించారు. అప్పటికి ఏడుగురు ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. ఎట్టకేలకు.. ఇందిరాగాంధీ దిగివచ్చి ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని 1970 ఏప్రిల్ 10న ప్రకటించారు.