మొండి గోడల నుంచి అక్షరసౌధం దాకా...
ABN , First Publish Date - 2020-11-29T06:11:16+05:30 IST
తాళపత్రాలలో అగ్గిపురుగులకు ఆహుతి అవుతున్న తెలుగు సాహిత్యాన్ని శుద్ధప్రతులుగా చేసి, తెలుగు పునరుజ్జీవన పితామహుడిగా పేరుపొందిన...
1995 నవంబర్ 29న కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభించారు. గ్రంథాలయానికి ప్రప్రథమంగా విలువైన గ్రంథాలను విరాళంగా ఇచ్చినవారు పోలేపల్లి వెంగన్న శ్రేష్ఠి. ఆచార్య బిరుదురాజు రామరాజు 2,800కు పైగా పుస్తకాలను బహూకరించారు. 2005లో ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి 15 లక్షల వార్షిక గ్రాంట్‌ను మంజూరు చేశారు. గ్రంథాలయ బాధ్యతలను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించారు. 2006 నవంబర్ 1న బ్రౌన్ గ్రంథాలయం ‘సిపిబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం’గా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో అంతర్భాగమయింది.
తాళపత్రాలలో అగ్గిపురుగులకు ఆహుతి అవుతున్న తెలుగు సాహిత్యాన్ని శుద్ధప్రతులుగా చేసి, తెలుగు పునరుజ్జీవన పితామహుడిగా పేరుపొందిన మహనీయుడే ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్(1798–-1884). ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టరుకు సహాయకుడిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు బ్రౌన్ కొన్నాడు (ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 రూపాయలతో సమానం). తెలుగు సాహిత్యానికి సేవ చేయడం కోసం ఆయన ఈ తోటను కొన్నాడు. ఆ స్థలాన్ని బ్రౌన్ కాలేజ్ అని ఆ రోజుల్లో పిలిచేవారు. సిపి బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణ కోసం కట్టించిన భవన శిథిలాల మీద నేటి సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆవిర్భవించడానికి తన జీవిత సర్వస్వాన్ని అంకితం చేసిన మహనీయుడు కీర్తిశేషుడు జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మొండిగోడల రూపంలో ఉన్న బ్రౌన్ బంగళా మూడు అంతస్తులతో కూడిన అక్షరసౌధంగా రూపుదిద్దుకోవడంలో ఆయన శ్రమ అసాధారణమైనది. జానమద్ది కృషిని ప్రశంసిస్తూ ఆయన్ని ‘బ్రౌన్‌శాస్త్రి’గా డా. సి నారాయణరెడ్డి కొనియాడారు.
డా.ఆరుద్ర, బంగోరె(బండి గోపాలరెడ్డి) 1976లో కడపకు వచ్చి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని కలసి బ్రౌన్ రూపొందించిన రీడర్ల ఆధారంగా కడపలో బ్రౌన్ నివసించిన బంగళా శిథిలాలను పరిశీలించి ఆయన నివసించిన స్థలం ఇదేనని నిర్ధారించారు. అదే రోజు సాయంత్రం అప్పటి కడప కలెక్టరు పిఎల్ సంజీవరెడ్డిని కలుసుకుని తెలుగు సాహిత్యం కోసం ఎంతో కృషి చేసిన సిపి బ్రౌన్‌కు స్మృతిచిహ్నంగా ఆయన నివసించిన స్థలంలో ఒక గ్రంథాలయం నిర్మించాలని కోరారు. తెలుగు సాహిత్యంపై అభిమానం ఉన్న సంజీవరెడ్డి వెంటనే స్పందించి, కడప ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా, కడపజిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్న డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రిని పిలిపించారు. సంజీవ రెడ్డి గ్రంథాలయ ఏర్పాటు బాధ్యతల గురించి చెప్పగానే ఆయన అంగీకరించారు. కపడ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డితో కలసి భవన నిర్మాణానికి తొలి అడుగు వేశారు.
కడపలో గొప్ప ఆడిటర్‌గా పేరు పొందిన సిఆర్ కృష్ణస్వామి 1937లో బ్రౌన్ నివసించిన బంగళాను, చుట్టూ ఉన్న 15 ఎకరాల తోటను కోర్టు వేలంలో రెండువేల రూపాయలకు కొన్నాడు. క్రమంగా బంగళా శిథిలావస్థకు చేరింది. 1977 నాటికి బంగళా మొండిగోడలు మాత్రమే మిగిలాయి. కృష్ణస్వామిని కలెక్టర్ సంజీవరెడ్డి ఆహ్వానించి బంగళా శిథిలాలు ఉన్న 20 సెంట్ల స్థలాన్ని బ్రౌన్ స్మృతిచిహ్నంగా నిర్మించే గ్రంథాలయానికి విరాళంగా ఇవ్వమని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. ఆ విధంగా స్థలసేకరణ పూర్తయింది.
1987లో జంధ్యాల హరినారాయణ జిల్లా కలెక్టర్‌గా వచ్చారు. ఆయన సూచన మేరకు అదే సంవత్సరం డిసెంబరులో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్టు రిజిస్టర్ అయింది. కలెక్టరును ట్రస్టు ప్రధాన పోషకుడిగా నియమించారు. ఆయన తెలుగు గ్రామీణ క్రాంతిపథం నిధుల నుంచి 3.5 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంటు మంజూరు చేసి చెక్కును చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా జానమద్దికి పంపించారు. కానీ ఊహించని విధంగా ఆ రోజు సాయంత్రమే కలెక్టర్ కి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. జానమద్ది విన్నపం మేరకు మరుసటిరోజు వరకు కడపలోనే ఉండి 1987 జనవరి 22న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు అధ్యక్షత వహించారు. హరినారాయణ ఆ రోజు సాయంకాలం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో కడప నుంచి వెళ్ళిపోతూ ‘Perhaps God has sent me for this purpose’(భగవంతుడు ఈ ఉద్దేశంతోనే నన్ను కడపకు పంపాడు కాబోలు) అని చెప్పి బండెక్కారు. నిధుల కోసం ప్రాంతీయ పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు, యం.రామిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.సత్యనారాయణగారికి జానమద్ది విన్నవించుకోగా కడప, ప్రొద్దుటూరు మునిసిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సమావేశపరచారు. ఆ సమావేశంలో జానమద్ది బ్రౌన్ సేవల గూర్చి ప్రసంగించారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి ఒక రూపాయి మాత్రం వసూలు చేయగా వారంరోజుల్లో 26 వేల రూపాయలు బ్రౌన్ స్మారక ట్రస్టుకు చేరాయి. ఆ డబ్బుతో గ్రంథాలయ ప్రహరీగోడ పూర్తయింది. ఒకవైపు ప్రభుత్వ తోడ్పాటు మరొకవైపు ప్రజల విరాళాలతో గ్రంథాలయ నిర్మాణ పనులు పూర్తవుతూ వచ్చాయి. పత్రికల్లో గ్రంథాలయ నిర్మాణం గురించి ప్రచురించిన వ్యాసాన్ని చదివి బస్తర్‌లోని డివి ప్రసాదరావు అనే తెలుగు కార్మికుడు తన విరాళంగా 10రూపాయలు పంపించాడు. అభిమానంతో పంపిన ఆ పదిరూపాల్ని పదివేలుగా భావించారు జానమద్ది. 1992 నుంచి బ్రౌన్ గ్రంథాలయం సేవలందిస్తోంది. 1995 నవంబర్ 29న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య, రాష్ట్ర మంత్రులు కోడెల శివప్రసాదరావు, ఎస్ వి సుబ్బారెడ్డి, బి.వీరారెడ్డి, కలెక్టరు వీణా ఈష్ అధికారికంగా ఈ గ్రంథాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వావిలాలతో చంద్రబాబు గ్రంథాలయాన్ని ప్రారంభింపచేశారు.
గ్రంథాలయానికి మొదటిసారిగా విలువైన గ్రంథాలను విరాళంగా ఇచ్చినవారు పోలేపల్లి వెంగన్న శ్రేష్ఠి(రాజా శ్రేష్ఠి). ఆయన 2,500కు పైగా పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఆచార్య బిరుదురాజు రామరాజు 2,800కు పైగా పుస్తకాలను గ్రంథాలయానికి బహూకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాలాంధ్ర విజ్ఞాన సమితి, ఆనంద బుద్ధ విహార ట్రస్టు, జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్, అఖిల భారత దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యదర్శి ఎంఏ సింఘాల్ విలువైన గ్రంథాలను బహూకరించారు. డా.గడియారం రామకృష్ణశర్మ, ముల్లంగి వెంకట రమణారెడ్డి, వావిళ్ళ సంస్థపరంగా అల్లాడి స్వామినాథన్, కోడూరు పుల్లారెడ్డి, భూమన్, ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు డా.పొత్తూరు వెంకటేశ్వరరావు, కాటాబత్తిన జనార్దన, బొల్లినేని శ్రీనివాసులు, వేమరాజు నరసింహారావు, నాగసూరి వేణుగోపాల్, హహబూబ్ సాహెబ్, డా.సివి సుబ్బన్న, శ్రీమతి ఏ.జి.ప్రసూన, మేడవరం దక్షిణామూర్తి, డా.పునుగు ఆదిలక్ష్మగార్లు ఒక్కొక్కరు వందలు, వేలు విలువైన పుస్తకాలు విరాళంగా ఇచ్చారు.
హనుమచ్చాస్త్త్రి మిత్రులు కొందరు గ్రంథాలయం రెండవ అంతస్థులో భాషా పరిశోధన కేంద్రం ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచించారు. దాని నిర్మాణంకోసం జానమద్ది వినతి మేరకు డా.సి నారాయణరెడ్డి ఎంపీలాడ్ నిధుల నుంచి రూ.10 లక్షలు విడుదల చేశారు. 2005 జనవరి 27న నాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయ ఆవరణలో బ్రౌన్ కుడ్యచిత్రాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ‘గ్రంథాలయాన్ని నిలబెట్టండి’ అని హనుమచ్ఛాస్త్రి అభ్యర్ధించగా, ప్రభుత్వం తరపున తప్పకుండా సహాయం చేస్తానని వై ఎస్ హామీ ఇచ్చారు. నెల లోపు లోనే బ్రౌన్ గ్రంథాలయానికి 15 లక్షల వార్షిక గ్రాంట్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడినాయి. గ్రంథాలయ బాధ్యతలను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నట్లుగా ఉత్తర్వును జారీచేశారు. అంతటితో సిపి బ్రౌన్ ట్రస్టు రద్దు అయింది. ట్రస్టు సేకరించిన 22 లక్షల రూపాయలు, 30 వేలకు పైగా పుస్తకాలను జానమద్ది యూనివర్శిటీకి అప్పగించారు. 2005 అక్టోబర్ 1 నుంచి బ్రౌన్ గ్రంథాలయం ‘సిపి బ్రౌన్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంతీయ తెలుగు భాషా సాహిత్యాల పరిశోధన కేంద్రం’గా రూపుదాల్చింది. 2006 మేలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్వీ యూనివర్శిటీ పిజి సెంటర్ స్థానంలో యోగి వేమన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది. ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీగా ఉన్న ఆచార్య జి.శివారెడ్డి 2006 నవంబర్ 1న బ్రౌన్ గ్రంథాలయానికి ‘సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం’గా నామకరణం చేసి యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా కలుపుకున్నారు.
డాక్టర్ చింతకుంట శివారెడ్డి
సహాయ పరిశోధకుడు సిపిబ్రౌన్ గ్రంథాలయం, కడప
(సిపిబ్రౌన్ గ్రంథాలయం పాతికేళ్ళ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా)