వీసీలు లేరు.. ఇన్చార్జులు చూడరు!
ABN , First Publish Date - 2020-12-04T08:53:07+05:30 IST
విశ్వ విద్యాలయాలకు చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్,

10 వర్సిటీలను గాలికొదిలేసిన ప్రభుత్వం..
విశ్వవిద్యాలయాల్లో పేరుకుపోతున్న సమస్యలు
సీఎం రెండుసార్లు ఆదేశించినా.. కదలని యంత్రాంగం
విశ్వవిద్యాలయాల్లో వీసీ ఖాళీల భర్తీ నా తొలి ప్రాధాన్యం. భర్తీ ప్రక్రియ సాధ్యమైనంత త్వరలో పూర్తయ్యేలా చూస్తా..
- ఇలా గత ఏడాదికాలంలో అనేకసార్లు పేర్కొన్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.
ఖాళీగా ఉన్న ఉప కులపతులను రెండు మూడు వారాల్లో నియమించండి.
- ఫిబ్రవరి-20న సీఎం కేసీఆర్ మొదటిసారి ఆదేశాలు.
వీసీల నియామకాలను వెంటనే చేపట్టండి..
- సెప్టెంబరు-5న సీఎం రెండోసారి ఆదేశాలు.
సీఎం ఆదేశించినందున నియామకం చేపడతాం
- సెప్టెంబరు-14న అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన.
ఆంధ్రజ్యోతి - హైదరాబాద్
విశ్వ విద్యాలయాలకు చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. గత ఏడాదికాలంలో పలుమార్లు చేసిన ప్రకటనలివి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సైతం రెండుసార్లు ఆదేశించినా.. నియామకం తీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. రాష్ట్రంలోని 10 వర్సిటీలకు వీసీలను నియమించకపోవడం, ఇన్చార్జులుగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు అటువైపు వెళ్లకపోవడంతో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి.
ఇన్చార్జీ పాలనలోనే ట్రిపుల్ ఐటీ..
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) యూనివర్సిటీకి పూర్తిస్థాయి వైస్ చాన్సలర్‌ను రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నియమించనే లేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జను ఫిబ్రవరిలో ఇన్చార్జి వీసీగా నియమించారు. గత 9 నెలల్లో రాహుల్ బొజ్జ కనీసం ఒక్కసారైనా వర్సిటీకి వెళ్లలేదు. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రాహుల్ బొజ్జ కొవిడ్, ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీల్లో ఉన్నారు.
మిగతా వర్సిటీల్లోనూ ఇదే తీరు..
ఉస్మానియా వర్సిటీ తాత్కాలిక బాధ్యతలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు అప్పగించారు. కాకతీయ వర్సిటీకి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జనార్ధన్ రెడ్డి; జేఎన్టీయూకి ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఇన్చార్జి వీసీలుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్‌కు అప్పగించారు. శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు వర్సిటీలకూ ఇన్చార్జులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులే కొనసాగుతున్నారు. వీరంతా వారి శాఖల వ్యవహారాల్లో తలమునకలై ఉంటున్నందున వర్సిటీలను పట్టించుకునే స్థితిలో లేరు.
సమస్యలు కోకొల్లలు..
ఏడాదిన్నరగా వీసీ పదవులు ఖాళీగా ఉండటంతో వర్సిటీల్లో సమస్యలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఏఐసీటీఈ, యూజీసీ వంటి అత్యున్నత సంస్థల మార్గదర్శకాల అమలు అంతంత మాత్రంగానే ఉంటోంది. అన్ని వర్సిటీల్లో వేలసంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలు కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా భర్తీకి నోచుకోవడం లేదు. రెండేళ్ల క్రితం 1061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. వీసీల నియామకం అయితేగాని వాటికి మోక్షం కలిగే పరిస్థితి లేదు.
భర్తీ ఇంకెప్పుడు..?
గత ఏడాది జూలై నాటికి రాష్ట్రంలో 9 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎ్ఫయూ) వీసీ పోస్టు కూడా ఖాళీ అయింది. దీంతో ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన వర్సిటీల సంఖ్య 10కి చేరింది. 9 వర్సిటీలకు మొత్తం 984 దరఖాస్తులు రాగా.. వీటిలో 273 మందిని అర్హులుగా గుర్తించారు. ప్రతి వర్సిటీకి ముగ్గురు చొప్పున పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ముగ్గురిలో ఒకరిని గవర్నర్ ఎంపికచేస్తారు. అయితే పేర్లను కమిటీ ఇంకా ప్రతిపాదించలేదు.