స్నేహమంటే ఇదేరా..

ABN , First Publish Date - 2021-05-18T05:35:33+05:30 IST

స్నేహమంటే ఇదేరా..

స్నేహమంటే ఇదేరా..
శ్రీధర్‌ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న స్నేహితులు

కరోనాతో మృతి చెందిన స్నేహితుడికి అంత్యక్రియలు

మహబూబాబాద్‌ టౌన్‌, మే  17: స్నేహానికన్న మిన్నా ఈ లోకాన లేదురా.. కడదాక నీడలాగా తోడై ఉండురా అన్న ఓ కవి కలం నుంచి జాలువారిన అక్షరా లను రుజువు చేశారు స్నేహితులు.. స్నేహం అంటే ఏదో జల్సాల కోసం కాదు. కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అని నిరూపించారు. ప్రస్తుతం కరోనాతో వ్యక్తి చనిపోతే కుటుంబసభ్యులే దగ్గరికి రావడం లేదే.. అలాంటిది కరోనాతో పోరాడి మరణించిన స్నేహితుడికి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయాక మోయడానికి నలుగురు స్నేహితులైనా సంపాందించుకో అన్న మాటలను నిజం చేశారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎమ్డీ.ఫరీద్‌, జన్ను మహేందర్‌, గుడిబోయిన వేణుగోపాల్‌, డాక్టర్‌ సంగాల రవి, యర్నం శ్రీధర్‌ చిన్న నాటిమిత్రులు. వారు హింధు, ముస్లిం, క్రిస్టియన్‌ అయినప్పటికీ కులమతాలకతీతంగా స్నేహితులుగా సంబురమైనా.. కష్టమైనా అందరు కలిసి పంచుకునే వారు. పండుగలు సైతం కలిసి చేసుకునే వారు. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి నిదుర పోయే వరకు వారంతా తరుచుగా పలకరించుకుంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారు. అయితే అందులో యర్నం శ్రీధర్‌(39) ఇటీవల కాలంలో కరోనా బారిన పడ్డాడు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు ఈనెల 5న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పన్నెండు రోజుల పాటు కరోనాతో పోరాడి సోమవారం ఉదయం కన్ను మూశారు, ఆయన మరణ వార్త విన్న ఆ నలుగురు స్నేహితులు హూటాహూటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కరోనాతో మృతి చెందినప్పటికి స్నేహితులు భయపడకుండా చివరి వరకు తామున్నామంటూ వారు పాడే మోసీ అంబర్‌పేట శ్మశాన వాటికలో స్నేహితుడు శ్రీధర్‌ అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో చనిపోతే రక్త సంబంధీకులే దూరముంటున్న తరుణంలో నలుగురు స్నేహితులు అంత్యక్రియలు నిర్వహించి స్నేహం అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. హ్యాట్సప్‌ ఫ్రెండ్స్‌...స్నేహనికి కొత్త అర్థానిచ్చారు.

 


Updated Date - 2021-05-18T05:35:33+05:30 IST