Venkaiah Naidu: భాష కళ్ళు లాంటిది... ఇంగ్లీష్ కళ్లద్దాల లాంటిది..
ABN , First Publish Date - 2022-12-23T12:35:13+05:30 IST
విజయవాడ: ప్రాథమిక విద్య మాతృబాషలో ఉండి తీరాలని.. ఇది తప్పని సరి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు.
విజయవాడ: ప్రాథమిక విద్య మాతృబాషలో ఉండి తీరాలని.. ఇది తప్పని సరి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. శుక్రవారం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రారంభమైన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన మాట్లాడుతూ పరిపాలన భాష మాతృ భాషలో ఉండాలని, న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులో ఉండాలన్నారు. ఉన్నత సాంకేతిక విద్యను మాతృబాషలోకి తేవాలని, ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాతృబాషలో మట్లాడాలని సూచించారు. ఇతర దేశాల వారు మన భాషా గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఉన్నాయని, ఇవి రాక ముందు ప్రజల్లో ఆలోచనలు పెంచేవి రచనలని పేర్కొన్నారు. శ్వాస, భాష రెండు మనకు ఎంతో ముఖ్యమని, శ్వాస, భాష రెండు అగకూడదన్నారు. భాష కళ్ళు లాంటిదని.. ఇంగ్లీష్ కళ్లద్దాల లాంటిదని.. కళ్ళు ఉంటేనే కళ్లద్దాలు ఉపయోగపడతాయన్నారు.
11వ శతాబ్దం నుంచి తెలుగు సాంస్కృతిక సంపద వెళ్లి విరిసిందని, నూతన సాహిత్య సృష్టితోపాటు పూర్వ సాహిత్యం రక్షణ కూడా రచయితల బాధ్యతని వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల పాటలు వింటానని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పూర్వపు రాష్ట్రపతి, ప్రధాని, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాతృభాషలోనే చదువుకున్నారని.. ఇంత కన్నా ఉన్నత స్థానం వుంటుందా? అని అన్నారు. సమాజానికి మేలు చేకూర్చేదే ఉత్తమ సాహిత్యమని.. సామాజిక స్పృహతో సాహిత్యం ఉండాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.