Minister Kakani: కందుకూరు ఘటనకు టీడీపీయే కారణం..
ABN , First Publish Date - 2022-12-29T11:09:17+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్న కందుకూరు (Kandukuru) సభా ప్రాంగణంలో జరిగిన ఘటనకు టీడీపీ (TDP)యే కారణమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
నెల్లూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్న కందుకూరు (Kandukuru) సభా ప్రాంగణంలో జరిగిన ఘటనకు టీడీపీ (TDP)యే కారణమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) విమర్శించారు. ఈ ఘటనపై గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. చంద్రబాబు ఏం చేశారని జనం వస్తారని ప్రశ్నించారు. సభకు ఎక్కువ మంది వచ్చారని చూపే ప్రయత్నం చేశారని, ఇరుకు సందులో బస్సు యాత్ర పెట్టారని ఆరోపించారు. టీడీపీ తీరుతో 8 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పక్కనే ఆస్పత్రి లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాకు విచ్చేశారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గాన జిల్లాకు బయలుదేరారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగరాయకొండ బైపాసుకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా నేతలు భారీ గజమాలలతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన కందుకూరుకు చేరుకున్నారు. రెవెన్యూ కాలనీ వద్ద టీడీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబుకు మేళతాళాలు, బాణసంచా పేల్చుతూ భారీగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి దివి కొండయ్య చౌదరి విగ్రహం మీదుగా ఎన్టీఆర్ విగ్రహం కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ మార్గంలో అడుగడుడునా చంద్రబాబుకు అత్మీయ స్వాగతం లభించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఆ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. అప్పటికే అనుకున్న షెడ్యూల ప్రకారం సమయం ఆలస్యమవడంతో వేగంగా కదలాలని బాబు శ్రేణులకు సూచిస్తూ వచ్చారు. కందుకూరు పట్టణమంతా పుసుపు రంగు జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది.
ఉదయం నుంచీ ఉరకలేసే ఉత్సాహం. ఈలలు, కేరింతలు, పూల వర్షంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తమ్ముళ్లు ఘనంగా ఆహ్వానించారు. సాయం సంధ్యవేళ కందుకూరులో జరిగిన రోడ్‌షోలోనూ జనం పోటెత్తింది. ఎన్టీఆర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో తమ అధినేతను కళ్లారా చూసేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు.
ఇంతలో..
‘‘తమ్ముళ్లూ... జాగ్రత్త! ప్రమాదం జరుగుతుంది.’’ అని హెచ్చరిస్తున్నా అనుకోని ఘటన జరిగిపోయింది. హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉల్లాసంగా సాగుతున్న చంద్రబాబు పర్యటనలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. సభను సంతాపసభగా నిర్వహించి, ఆ దురదృష్టకర ఘటనలో అసువులు బాసిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు వెల్లడించారు. పలు సహాయక కార్యక్రమాలు ప్రకటించారు.