Share News

Ugadi 2025 :ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి.. ఆ రోజున తప్పక చేయాల్సిన పనులేంటి..

ABN , Publish Date - Mar 29 , 2025 | 07:40 PM

Ugadi 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఇవొక్కటే కాదు. ఉగాది రోజున తప్పక చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.

Ugadi 2025 :ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి.. ఆ రోజున తప్పక చేయాల్సిన పనులేంటి..
How to celebrate Ugadi

Ugadi 2025: తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేది ఉగాది పండగతోనే. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమినాడే ఈ సృష్టి ప్రారంభమైందని నమ్ముతారు. శాలివాహన శకం మొదలైంది కూడా ఉగాది రోజు నుంచే. ఈ పండగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ప్రజలు ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. అలాగే మహారాష్ట్ర, గోవాల్లో గుడిపడ్వా పేరుతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.


వసంత కాలంలో వచ్చే ఉగాదిని యుగాది అని కూడా అంటారు. అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈ సారి ఉగాది మార్చి 30వ తేదీన జరుపుకోనున్నారు. ఈ సారి తెలుగు వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఈ రోజున తెలుగువారంతా వేకువజామునే నిద్రలేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్రపరచుకుంటారు. ఇంటిల్లిపాదీ తలస్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారు. ప్రతి తెలుగు లోగిలి మామిడి తోరణాలతో వెలిగిపోతూ ఉంటుంది. ఇష్టదేవతలకు పూజల చేసి రకరకాల పిండివంటకాలు చేసుకుని ఉగాది పండగనాడు తెలుగువారు ఉల్లాసంగా, సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి తినకుండా, కొత్త ఏడాదిలో తమ భావి జీవితం ఎలా ఉంటుందో చెప్పే పంచాంగా శ్రవణం వినకుండా ఈ పండగ పూర్తి కానే కాదు.


ఉగాది ఎలా జరుపుకోవాలి?

  • ఉగాది పచ్చడిలోని షడ్రుచులు (ఆరు రుచులు) జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలు. కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత మంచి, చెడు ఇలా ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాలనేదే ఉగాది పచ్చడి తినడం వెనక ఉన్న పరమార్థం.

  • ఉగాది పచ్చడిని తప్పకుండా కుటుంబసభ్యులతో కలిసి తినాలని పురాణాలు చెబుతున్నాయి. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారుచేస్తారు.

  • బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజునే కొత్త పనులు మొదలుపెడితే శుభం చేకూరుతుందని ప్రజల విశ్వాసం. యుగానికి నాంది పలికిన ఈ రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి వేదాలను సోమకుడి నుంచి రక్షించి బ్రహ్మదేవుడికి ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి.

  • ఉగాది రోజున కుటుంబసమేతంగా పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి తెలుగువారు అడుగుపెడుతున్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విశ్వానికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి శుభసూచకం. కరవు కాటకాలు లేకుండా ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలతో తులతూగుతారని, పంటలు బాగా పండేలా వాతావరణం అనుకూలిస్తుందని పంచాంగ నిపుణులు భావిస్తున్నారు.


Read Also: Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా

Ugadi Special: ఉగాది పచ్చడి వెనుక రహస్యం తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు

Pooja Timings: మీ పూజలకు ప్రతిఫలం దక్కాలంటే.. ఇవి తప్పక తెలుసుకొండి

Updated Date - Mar 29 , 2025 | 07:41 PM