Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:15 PM
Hyderabad Metro: మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో(Metro Rail) ప్రయాణికులకు ఉగాది పండుగ వేళ తీయటి కబురు చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇవాళ(శనివారం) ఓ ప్రకటన విడుదల చేశారు. నగర రవాణాలో అగ్రగామిగా ఉన్న మెట్రో ఆవిష్కరణ, సామర్థ్యం, అవకాశాలు అందించటం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉగాది సందర్భంగా మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు..
హైదరాబాద్ మెట్రో రైలు, కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని.. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు ఈ స్థితికి మెట్రో వచ్చిందని వెల్లడించారు. ఎల్ అండ్ టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు వెళుతుందని వ్యాఖ్యానించారు. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను తమ రవాణా వ్యవస్థలో చేర్చడం ద్వారా, ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని అన్నారు. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి మెట్రో రైలు వస్తుండటంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని ఉద్ఘాటించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో మెట్రో రైల్ బ్యాక్ బోన్‌గా ఉందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
మెట్రో రైలులో సౌకర్యవంతమైన ప్రయాణం: సీఈవో కేవీబీ రెడ్డి
మెట్రో రైలు సౌకర్యవంతమైన ప్రయాణమని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి వ్యాఖ్యానించారు. టీ -సవారీ యాప్, ప్రయాణికుల కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ మెట్రోను డిజిటల్‌గా సుసంపన్నమైన రవాణా వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో చాలా ఏకో ఫ్రెండ్లీ సిస్టమని తెలిపారు. సాయంత్రం సమయాల్లో చాలా ఎక్కువ రద్దీగా ఉందని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు కట్టుబడి ఉందని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.
రైలు సమయాల పొడిగింపు ఇలా..
పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించటం కోసం తమ టెర్మినల్ స్టేషన్‌ల నుంచి చివరి రైలు బయలుదేరే సమయంలో మార్పులు చేసినట్లు మెట్రో యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం రాత్రి 11:00 గంటల వరకు మాత్రమే మెట్రో రైలు నడుస్తోందని.. ఆ సమయాన్నిరాత్రి 11:45లకు మార్పు చేసినట్లు మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది. మార్చిన సమయాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రకటించింది. (సోమవారం నుంచి శుక్రవారం వరకు) మాత్రమే మార్చిన సమయాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఆదివారాల్లో మాత్రం టెర్మినల్ స్టేషన్‌ల నుంచి మొదటి రైలు ఉదయం 7:00గంటలకు బయలుదేరుతుందని మెట్రో యాజమాన్యం ప్రకటించింది.
ఆ ఆఫర్ పొడిగింపు
ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO), ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ ఆఫర్‌తో 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించేలా మెట్రో యాజమాన్యం అవకాశం కల్పించింది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో యాజమాన్యం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
Phone Tapping Case: పోలీసుల ముందు శ్రవణ్ రావు.. అడిగిన ప్రశ్నలివే..
Read Latest Telangana News and Telugu News