Power Game In Vinukonda YCP: వైసీపీలోనే ఉంటూ మక్కెన వ్యతిరేకంగా పోరాటం చేస్తారా?

ABN , First Publish Date - 2022-09-01T23:58:43+05:30 IST

రాజకీయ చైతన్యానికి మారు పేరుగా ఉన్న పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో పవర్ గేమ్...

Power Game In Vinukonda YCP: వైసీపీలోనే ఉంటూ మక్కెన వ్యతిరేకంగా పోరాటం చేస్తారా?

వినుకొండ: రాజకీయ చైతన్యానికి మారు పేరుగా ఉన్న పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో పవర్ గేమ్ (Power Game In Vinukonda YCP) నడుస్తోంది. వినుకొండ కాంగ్రెస్ (Congress) రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి మండల స్థాయి పదవులు పొంది ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి మక్కెన మల్లికార్జునరావు (Makkena MarlliKarjunaRao). కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Mla Bolla BrahmaNaidu), నరసరావుపేట ఎంపీ విజయానికి ఎంతో కృషి చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. మక్కెనను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో మక్కెన వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. మక్కెనపై ఎమ్మెల్యే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.


మరోవైపు బ్రహ్మనాయుడు తీరుతో మక్కెన ఇబ్బందులు పడుతున్నారట. చేపల చెరువుల వ్యాపారంలో ఉన్న మక్కెన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు సొసైటీల్లో ఎమ్మెల్యే ఎదురు తిరగడం జరిగిందట. దీంతో చాలా చెరువులు మక్కెన చేజార్చుకోవాల్సి వచ్చిందట. సొంత గ్రామం పెదకంచెర్ల చెరువు విషయంలోనూ కొంతమందిని ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని మక్కెన వర్గీయులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు చేపల వ్యాపారానికి సొసైటీల నుంచి తీసుకున్న రుణాల్లోనూ మక్కెనపై ఒత్తిడి పెరిగిందట. 


అంతేకాదు మక్కెన 20 ఏళ్లుగా నివాసముంటున్న ఎన్ఎస్పీ భవనాలను కూల్చివేశారట. బాగున్న భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవాలని.. కూల్చవద్దని మక్కెన స్వయంగా ఎమ్మెల్యే బొల్లాకు విన్నవించినా పట్టించుకోలేదట. నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే కూల్చి వేసి అదే వేగంతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారట. ఇలా.. ఎమ్మెల్యే బొల్లా అభివృద్ధి పేరుతో అదే పార్టీకి చెందిన మక్కెనను ఇబ్బంది పెట్టడంతో ఆయన వర్గం ఆగ్రహంతో ఊగిపోతోందట.  అయితే ఎమ్మెల్యే టార్గెట్‌ నేపథ్యంలో మక్కెన వైసీపీలోనే ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారా లేక ప్రత్యర్థి పార్టీల వైపు మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాలి.




Updated Date - 2022-09-01T23:58:43+05:30 IST