శారదా పీఠానికి మంత్రులు క్యూ!
ABN , First Publish Date - 2022-04-26T06:38:35+05:30 IST
విశాఖపట్నంలోని చినముషిడివాడలో గల శారదా పీఠం మరో అధికార కేంద్రంగా మారింది.

ఇప్పటికే అరడజను మందికిపైగా రాక
పీఠాధిపతికి స్వరూపానందేంద్ర సరస్వతికి కొంతమంది సాష్టాంగ ప్రణామాలు
మరికొందరు పాదపూజలు
పీఠాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన పర్యాటక శాఖా మంత్రి రోజా
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే పెరిగిన ప్రాబల్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలోని చినముషిడివాడలో గల శారదా పీఠం మరో అధికార కేంద్రంగా మారింది. ప్రముఖుల తాకిడి పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో కొత్తగా స్థానం పొందినవారు ఒక్కొక్కరుగా వచ్చి పీఠాన్ని సందర్శిస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్వరూపానందేంద్ర సరస్వతి ముందు మోకరిల్లి, సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారో లేదో గానీ...శారదా పీఠాధిపతి ఆశీస్సుల కోసం మాత్రం తాపత్రయపడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే శారదా పీఠానికి ప్రాధాన్యం బాగా పెరిగింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే ఇక్కడికి వచ్చి పూజలు చేయడం, పీఠాధిపతి చెప్పిన పనులన్నీ ప్రభుత్వంలో జరుగుతుండడంతో రాజకీయ నాయకులు, అధికారులు ఆయన అనుగ్రహం కోసం అర్రులు చాస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, మత్స్యకార శాఖ మంత్రి సీదరి అప్పలరాజు, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడులు పీఠానికి వెళ్లి పీఠాధిపతికి వంగి వంగి దండాలు పెట్టారు. కొంతమంది సాష్టాంగ ప్రణామం చేశారు. తాజాగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సోమవారం స్వామిని దర్శించుకున్నారు. పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా అయితే పీఠం పరిసరాలను చూసి, సందర్శకులు ఎక్కువగా ఉన్నారని, పీఠం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
దేవదాయ శాఖకు అధికార కేంద్రం
దేవదాయ శాఖకు శారదా పీఠం అధికార కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడకు వచ్చి పీఠాధిపతికి కష్టాలు చెప్పుకొని ఆశీస్సులు తీసుకున్న వారికి కావలసిన పోస్టింగ్ దక్కుతుందనే ప్రచారం ఉంది. ఇంతకు ముందు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వాణీమోహన్ ఆయన ఆశీస్సులతోనే పనిచేశారు. తాజాగా ఆ బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్ సింఘాల్ కూడా రెండు రోజుల క్రితం పీఠానికి వచ్చి సుమారుగా రెండు గంటలు పీఠాధిపతితో ప్రత్యేకంగా సమావేశమై సలహాలు తీసుకున్నారు. దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం పీఠానికి రాగా, దేవాలయాల్లో కరోనాకు ముందు ఎలాగైతే ఉత్సవాలు, సంబరాలు చేసేవారో...వాటిన్నింటిని ఇప్పుడు పునఃప్రారంభించాలని పీఠాధిపతి సూచించారు. తప్పకుండా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చి వెళ్లారు. ప్రస్తుతం దేవదాయ శాఖలో ఆలయాలకు ట్రస్టు బోర్డు నియామకాలు జరుగుతున్నాయి. శారదా పీఠాధిపతి సిఫారసు చేస్తే కచ్చితంగా పదవి ఖాయమని తెలిసి అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఆయన్ను ప్రసన్నం చేసుకుంటారు. ఇటీవల సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డులోను స్వరూపానందేంద్ర సూచించిన వారికి ప్రాధాన్యం లభించింది. ఇక ఈ ప్రాంత దేవదాయ శాఖ అధికారులైతే...ఏ కార్యక్రమం చేసినా ముందుగా ఆయన చెవిన ఓ మాట వేసి ముందుకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు.
భీమిలి ప్రాంతంలో 15 ఎకరాలు కేటాయింపు
చినముషిడివాడలో శారదా పీఠం అభివృద్ధి చేయడానికి అవసరమైన భూమి లేనందున వేరే ప్రాంతంలో పీఠానికి అనుబంధంగా మరో ఆశ్రమం అభివృద్ధి చేయాలని స్వరూపానందేంద్ర నిర్ణయించారు. భీమిలి మండలంలో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో 15 ఎకరాలు ఎంపిక చేసుకొని, ఆ భూమిని కేటాయించాలని కోరితే...రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండా అతి తక్కువ ధరకు కేబినెట్‌లో ఆమోదముద్ర వేసి అప్పగించింది.
