SBI: ఉదయం నుంచి పనిచేయని ఎస్‌బీఐ సర్వర్.. వినియోగదారుల గగ్గోలు

ABN , First Publish Date - 2022-11-21T20:20:12+05:30 IST

భారతీయ స్టేట్‌బ్యాంక్ (SBI) ఖాతాదారులకు సోమవారం ఉదయం మొదలైన కష్టాలు ఇంకా తెల్లవారడం లేదు. ఆన్‌లైన్ పేమెంట్లు

SBI: ఉదయం నుంచి పనిచేయని ఎస్‌బీఐ సర్వర్.. వినియోగదారుల గగ్గోలు

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌బ్యాంక్ (SBI) ఖాతాదారులకు సోమవారం ఉదయం మొదలైన కష్టాలు ఇంకా తెల్లవారడం లేదు. ఆన్‌లైన్ పేమెంట్లు చేయలేక దేశ్యవాప్తంగా లక్షలాదిమంది ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ పేమెంట్ చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి సర్వర్ డౌన్ అని చూపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని ఖాతాదారులు గంటల తరబడి వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది. దీనికి తోడు ఎస్‌బీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం కూడా వినియోగదారులను విస్మయానికి గురిచేస్తోంది.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత జనం క్రమంగా డిజిటల్ లావాదేవీలవైపు మళ్లారు. ముఖ్యమైన ట్రాన్సాక్షన్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. అలాంటిది ఈ ఉదయం నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ సమస్య ఇప్పుడే లేదని, గత రెండు రోజులుగా ఉందని ఖాతాదారులు మొత్తుకుంటున్నారు. అతి కష్టం మీద ఆదివారం పేమెంట్లు చేయగలిగినప్పటికీ సోమవారం మాత్రం కనీసం బ్యాలెన్స్ చూసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐపై దుమ్మెత్తి పోస్తున్నారు. గంటలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది యూజర్లు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, భీం వంటి వాటి ద్వారా కూడా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయలేకపోతున్నట్టు చెప్పారు. చివరికి ఎస్‌బీఐ సొంత యాప్ ‘యోనో’ (YONO) కూడా మొరాయించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నా ఎస్‌బీఐ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.

Updated Date - 2022-11-21T21:44:29+05:30 IST