Group-4 posts: 9,168 పోస్టులకు నోటిఫికేషన్ జారీ!
ABN , First Publish Date - 2022-12-02T11:26:53+05:30 IST
గ్రూపు-4 పోస్టుల (Group-4 posts) భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ పోస్టుల కోసం పోటీ పడే అభ్యర్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవాలని తెలంగాణ

భర్తీకి నోటిఫికేషన్ జారీ!
23 నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనవరి 12 వరకు అవకాశం
ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-4 పోస్టుల (Group-4 posts) భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ పోస్టుల కోసం పోటీ పడే అభ్యర్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(Telangana Public Service Commission) (టీఎస్‌పీఎస్సీ) అధికారులు గురువారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పరీక్షను ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పూర్తి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసింది. తాజాగా గ్రూపు-4లోని 9,168 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ పోస్టుల ఎంపిక కోసం ప్రత్యేక పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం
గ్రూపు-4 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు ప్రత్యేక పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఇస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను ఉదయం, పేపర్-2ను సాయంత్రం నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ రాయడానికి 150 నిమిషాల పాటు సమయాన్ని ఇస్తారు.
పేపర్-1లో వర్తమాన వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు, సామాన్య శాస్త్రం, పర్యావరణ అంశాలు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాజకీయం వంటి సబ్జెక్టులు ఉంటాయి. పేపర్-2లో మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉండవు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. కేటగిరీల వారీగా రిజర్వేషన్లను అమలు పరుస్తారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్, కొత్తగా పెంచిన ఎస్టీ రిజర్వేషన్‌ను కూడా అమలు పరచనున్నారు.
అసిస్టెంట్ ఇంజనీర్ల అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్!
అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ అప్షన్ల అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు గురువారం టీఎ్‌సపీఎ్‌ససీ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసకున్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని సూచించారు.
ఇదే నెలలో మరిన్ని నోటిఫికేషన్లు!
ఈ నెలలో మరిన్ని పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ కసరత్తును చేపట్టింది. 783 గ్రూపు-2 పోస్టులు, 1373 గ్రూపు-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. వీటికి నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. వెయ్యి వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. డిసెంబరు 31వ తేదీలోపు అన్ని రకాల నోటిఫికేషన్లను జారీ చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీని కూడా రాత పరీక్ష ద్వారానే చేపట్టనున్నారు.