ధనిక దేశాలు సహకరించాలి

ABN , First Publish Date - 2022-11-08T03:04:20+05:30 IST

మానవాళి మనుగడకు పెను సవాల్‌ విసురుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్‌ పిలుపునిచ్చారు.

ధనిక దేశాలు సహకరించాలి

గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టాలంటే

కఠిన చర్యలు తీసుకోక తప్పదు

అమెరికా, చైనా బాధ్యత తీసుకోవాలి

కాప్‌-27 సదస్సులో యూఎన్‌ ప్రధాన కార్యదర్శి గుటారెస్‌

షర్మ్‌ ఎల్‌ షేక్‌ (ఈజిప్టు), నవంబరు 7: మానవాళి మనుగడకు పెను సవాల్‌ విసురుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్‌ పిలుపునిచ్చారు. మనం వాతావరణ నరకానికి వెళ్లే రహదారిపై వేగంగా దూసుకెళ్తున్నామని ఆయన హెచ్చరించారు. ఈజిప్టు వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)-27 సదస్సుకు హాజరైన ప్రపంచ నాయకులను ఉద్దేశించి సోమవారం ఆయన మాట్లాడారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టేందుకు ధనిక పారిశ్రామిక దేశాలు సహకరించాలని, ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. పెరిగిపోతున్న ఉద్గారాలను నియంత్రించడానికి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కూడా తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్గారకాలు విడుదల చేసే రెండు పెద్ద దేశాలైన అమెరికా, చైనాలకు ఈ విషయంలో ప్రత్యేక బాధ్యత ఉందని అన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను ఎదుర్కోవడానికి పేద దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన వాతావరణ సంఘీభావ ఒప్పందాన్ని రూపొందించాలని ప్రపంచ దేశాలను కోరారు. శిలాజ ఇంధన కంపెనీల లాభాలపై పన్ను విధించాలని పునరుద్ఘాటించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్లా ఫతా ఎల్‌ సిసి తన ప్రారంభోపన్యాసంలో ఈ భూ గ్రహం బాధల ప్రపంచంగా మారిందని అన్నారు. ‘‘మన జోక్యం లేకుండా వాతావరణ మార్పు ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక్కడ సమయం పరిమితంగా ఉంది. మనకున్న ప్రతి సెకనునూ ఉపయోగించుకోవాలి’ అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యద్ధానికి కూడా ముగింపు పలకాలని ఆయన సూచించారు. ఘనా అధ్యక్షుడు నానా అఫుకో-అడ్డో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు బాధ్యత వహించే సంపన్న దేశాలు.. వాటి ప్రభావంతో దెబ్బతిన్న ఆఫ్రికా దేశాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు తాము సహకరిస్తామని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీవో) చీఫ్‌ ఎన్‌గోజి ఒకోంజి ఐవియాలా అన్నారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఏఐ గోర్‌ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులకు కారణమయ్యే శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపేయాలని కోరారు. మరణం కంటే జీవించి ఉండడాన్నే కోరుకోవాలని అన్నారు. వాతావరణ మార్పులపై హెచ్చరికలు చేసిన వారిలో ముందువరుసలో ఉండే గోర్‌.. ప్రత్యామ్నాయ ఎంపికల ద్వారా విధ్వంసకర పరిస్థితుల నుంచి తప్పించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారంతో ఈ సదస్సు ముగుస్తుంది.

Updated Date - 2022-11-08T03:04:21+05:30 IST