'Kaali' poster row: కెనడా మ్యూజియం క్షమాపణలు
ABN , First Publish Date - 2022-07-06T19:58:35+05:30 IST
కాళీ మాత ధూమపానం చేస్తున్నట్లు కనిపిస్తున్న పోస్టర్ పట్ల కెనడా

న్యూఢిల్లీ : కాళీ మాత ధూమపానం చేస్తున్నట్లు కనిపిస్తున్న పోస్టర్ పట్ల కెనడా (Canada)లోని ఆగా ఖాన్ మ్యూజియం (Aga Khan Museum) క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం మేకర్ లీనా మేకలై రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్‌పై కెనడాలోని ఇండియన్ హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసి, దీనిని తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే.
‘అండర్ ది టెంట్’ నుంచి వచ్చిన 18 షార్ట్ వీడియోలలో ఒకటి, దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల అనుకోకుండా హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు గాయపడినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆగా ఖాన్ మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది.
‘అండర్ ది టెంట్’ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం (Toronto Metropolitan University) ఓ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొంది. దీనిలో భాగంగా వివిధ సాంస్కృతిక, ప్రాంతీయ నేపథ్యాలుగల విద్యార్థులు రూపొందించిన కళా రూపాలను తాము ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. కళల ద్వారా అంతర్ సాంస్కృతిక అవగాహన, చర్చలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు తాము ఆతిథ్యమిస్తున్నట్లు తెలిపింది. వేర్వేరు మతపరమైన వ్యక్తీకరణలు, విశ్వాసాలను గౌరవించడం ఈ కార్యక్రమంలో భాగమని పేర్కొంది.
ఇదిలావుండగా, స్మోకింగ్ కాళీ పోస్టర్‌పై కెనడాలోని భారత హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలను తక్షణమే ఉపసంహరించాలని కెనడా అధికారులను, ఈవెంట్ ఆర్గనైజర్లను కోరింది. ఈ పోస్టర్‌పై హిందూ దేవతలను కించపరుస్తూ ప్రచురించారని తమకు కెనడాలోని హిందూ నేతలు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
ఫిలిం మేకర్ లీనా మణిమేకలై సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కాళీ మాత వస్త్ర ధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ కాల్చుతున్నట్లు ఈ పోస్టర్‌లో ఉంది. ఈ దేవత చేతిలో ఎల్‌జీబీటీక్యూప్లస్‌కు చెందిన జెండాను ధరించినట్లు కనిపించింది.