PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:38 AM
దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే, దేశంలోని తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకత ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు పీఎం ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.

2025-26 బడ్జెట్ వెబినార్‌లో ప్రధాని వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాభివృద్ధికీ, రైతు సంక్షేమానికీ తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే, దేశంలోని తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకత ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు పీఎం ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా తొలుత ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. 2025-26 బడ్జెట్‌కు సంబంధించి వ్యవసాయం-గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటుచేసిన వెబినార్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను ముందుగా మొదలుపెట్టాలని అధికారులను కోరారు. ప్రస్తుతం దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, అయినప్పటికీ దేశీయ వినియోగంలో 20ు ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు.
ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పాడి పరిశ్రమ, మత్స్య ఉత్పత్తులు మరింత పెరగాల్సి అవసరం ఉందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు దాదాపు రూ.3.75 లక్షల కోట్లు అందించామని గుర్తు చేశారు. గత పదేళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 265 మిలియన్ టన్నులు ఉండేదని, అదిప్పుడు 330 మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపారు. ఉద్యానవన ఉత్పత్తి 350 మిలియన్ టన్నులను దాటిందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో 2,900కి పైగా కొత్త రకాల పంటలను అభివృద్ధి చేశామన్నారు. అయితే, కొత్త రకాలు రైతులకు అందుబాటులో ధరలో ఉంచేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపపంచ కార్ఖానాగా భారత్..
ప్రపంచ కార్ఖానాగా భారత్ అవతరిస్తోందని, ఉత్పాదక రంగ హబ్‌గాను మారుతోందని మోదీ ప్రకటించారు. ఇకనెంత మాత్రం భారత్ శ్రామికశక్తి కాదని..అది ప్రపంచ శక్తిగా మార్పు చెందుతోందని తెలిపారు. ‘న్యూస్ ఎక్స్ వరల్డ్’ చానల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన సదస్సులో (ఎన్‌ఎక్స్‌టీ) మోదీ ప్రసంగించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే తన విధానం ఫలితాలను ఇస్తోందని, మన దేశ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. ‘‘21వ శతాబ్ద భారత్‌ను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. మనదేశాన్ని సందర్శించాలని కోరుకుంటోంది’’ అని తెలిపారు. ‘‘ప్రపంచ ఆహార సరఫరాల గొలుసులో అత్యంత నమ్మకమైన, సౌకర్యవంతమైన భాగస్వామిగా భారత్ అవతరించింది’’ అని మోదీ అన్నారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.