Bharat Jodo Yatra: పాదయాత్రకు రమ్మంటూ స్మృతి ఇరానీకి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-12-30T16:55:53+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని...

Bharat Jodo Yatra: పాదయాత్రకు రమ్మంటూ స్మృతి ఇరానీకి ఆహ్వానం

లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో పాల్గొనాలని అమేథీ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి (Smriti Irani) ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత దీపక్ సింగ్ పార్టీ తరఫున ఈ ఆహ్వానం పంపారు. గౌరిగంజల్‌లోని స్మృతి ఇరానీ కార్యాలయంలో ఆమె కార్యదర్శి నరేష్ శర్మకు లేఖ అదించారు.

రాహుల్ యాత్రకు ప్రముఖులందరినీ ఆహ్వానించాలని పార్టీ సీనియర్ నేతలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 28న మంత్రి క్యాంప్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఆమె కార్యదర్శికి ఆహ్వాన పత్రిక అందించానని దీపక్ సింగ్ తెలిపారు. ఆయన తన లేఖను తీసుకుని ఎంపీకి అందజేస్తామని చెప్పినట్టు వివరించారు.

ఎందుకు వెళ్లాలి?: బీజేపీ

కాగా, స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ఆహ్వానంపై బీజేపీ నేత దుర్గేష్ త్రిపాఠి స్పందించారు. ఆహ్వానించడం వరకే వాళ్ల (కాంగ్రెస్) పని అని అన్నారు. ''బీజేపీ ఎప్పుడు పనిచేసినా దేశ సమైక్యత కోసమే పనిచేస్తుంది. దేశం ముక్కలు కావడం అనే ప్రసక్తే లేనప్పుడు సమైక్యం చేయడం అనే ప్రసక్తి ఎలా వస్తుంది? ఏమి ముక్కలైందని యాత్రలో చేరాలి? అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు. దానికి భారత్ జోడో యాత్ర అనే పేరు పెట్టారు'' అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు సార్లు ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీని 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఓడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జనవరి 3న ఘజియాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి అడుగుపెట్టనుంది.

Updated Date - 2022-12-30T16:55:57+05:30 IST