సగ్గు బియ్యంతో స్పెషల్‌గా...
ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉల్లి దోశ, సాంబారు ఇడ్లీ అంటే

రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉల్లి దోశ, సాంబారు ఇడ్లీ అంటే ఎవ్వరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈ సారి సగ్గుబియ్యంతో వడలు వేసుకోండి. సాబుదానా బోండాలను ఒక్కసారి రుచి చూస్తే మీ బ్రేక్‌ఫాస్ట్ మెనూలో అవి రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా సగ్గుబియ్యంతో దోశలు, థాలీ పీట్, పాపడ్ వంటివి చేసుకోవచ్చు. వాటి తయారీ విశేషాలు ఈ వారం మీకోసం...
వడలు
కావలసినవి
సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, బంగాళదుంపలు - రెండు, పంచదార - అర టీస్పూన్, పల్లీలు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి - మూడు, కొత్తిమీర- ఒక కట్ట, నిమ్మరసం - అర టేబుల్‌స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని కడిగి పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
బంగాళదుంపలను మెత్తగా ఉడికించుకుని పొట్టు తీసేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు బంగాళదుంపల బౌల్‌లో సగ్గుబియ్యం, పల్లీల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, పంచదార, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వడలుగా ఒత్తుకోవాలి. తరువాత కొద్దిసేపు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వడలు వేసి వేయించాలి. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
సాబుదానా థాలీ పీట్
కావలసినవి
సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, బంగాళదుంపలు - రెండు, జీలకర్ర - అర టీస్పూన్, పల్లీలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మరసం - ఒకటీస్పూన్, పంచదార - ఒక టీస్పూన్, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.
తయారీ విధానం
సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి.
బంగాళదుంపలను ఉడికించి, పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి.ఠి పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి.
ఉదయాన్నే సగ్గుబియ్యంలో నీళ్లన్నీ తీసివేసి బంగాళదుంపల గుజ్జు వేసి కలుపుకోవాలి.
జీలకర్ర, పల్లీల పొడి, అల్లం, కొత్తిమీర, పంచదార, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసి పాన్‌పై సమంగా అంటేలా రాయాలి.
అర చేతులకు కొద్దిగా నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ థాలీ పీట్‌లు ఒత్తుకోవాలి. వీటిని పాన్‌పై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
పాన్ పెద్దగా ఉంటే ఒకేసారి రెండు మూడు థాలీ పీట్‌లు వేసి కాల్చుకోవచ్చు.
చట్నీ లేదా టొమాటో కెచప్‌తో సర్వ్ చేసుకుంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.

సగ్గుబియ్యం దోశలు
కావలసినవి
సగ్గుబియ్యం - ఒక కప్పు, బొంబాయి రవ్వ - అరకప్పు, పెరుగు - మూడు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, జీలకర్ర - అర టీస్పూన్, కరివేపాకు - రెండు రెమ్మలు, పచ్చిమిర్చి - నాలుగు.
తయారీ విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా పట్టుకుని బౌల్‌లోకి తీసుకోవాలి.
తరువాత అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి చిక్కటి పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, దంచిన పచ్చిమిర్చి, రుచికి తగిన ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మిశ్రమం మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, పాన్ అంతటా రాసి మిశ్రమాన్ని దోశలా పోసుకోవాలి.
చిన్నమంటపై కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత మరోవైపు తిప్పి కాల్చుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ దోశలు సర్వ్ చేసుకోవచ్చు.

సగ్గుబియ్యం బోండాలు
కావలసినవి
సగ్గుబియ్యం - ఒక కప్పు, బటర్‌మిల్క్ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, బియ్యప్పిండి - పావుకప్పు, పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - రెండు రెమ్మలు, ఎండుకొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా.
తయారీ విధానం
ఒక బౌల్‌లో సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరువాత అందులో బటర్‌మిల్క్ పోయాలి. తరిగిన పచ్చిమిర్చి, అల్లంముక్క, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి.
సగ్గుబియ్యం బటర్‌మిల్క్‌ను గ్రహించి మెత్తగా అవుతాయి. ఇప్పుడు బియ్యప్పిండి, పల్లీల పొడి, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, జీలకర్ర వేసి కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు.
తరువాత స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి.
అరచేతులకు కాస్త నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాల్లా చేసుకుంటూ నూనెలో వేసి వేయించుకుంటే బోండాలు రెడీ.

సాబుదానా పాపడ్
కావలసినవి
సగ్గుబియ్యం - ఒక కప్పు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్.
తయారీ విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి రెండు, మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కాస్త మెత్తగా అయ్యాక నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి నాలుగు కప్పుల నీళ్లు పోసి సగ్గుబియ్యం వేయాలి. కాస్త వేడి అయిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
చిన్నమంటపై ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యాక నిమ్మరసం పిండుకుని దింపుకోవాలి.
వెడల్పాటి ప్లేట్‌లలో సగ్గుబియ్యం మిశ్రమాన్ని పోసుకోవాలి. వీటిని ఐదారు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. దుమ్ము పడకుండా కాటన్ క్లాత్ కప్పి ఎండలో ఆరబెట్టుకోవచ్చు.
వీటిని జాడీలో భద్రపరచుకుని స్నాక్స్‌గా సర్వ్ చేసుకోవచ్చు.
