Share News

CM Chandrababu: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:59 AM

ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం

2026 మార్చి 16కి పూర్తి

మ్యూజియంగా శ్రీరాములు నివాసం

రాజధానిలోనే స్మారక కేంద్రం కూడా ఏర్పాటు చేస్తాం

పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులపాటు కఠోర దీక్ష చేపట్టి, ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలోని నివాసాన్ని మ్యూజియంగా రూపుదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్‌ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. గ్రామస్థుల విన్నపం మేరకు బకింగ్‌ హామ్‌ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని, తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఆయన గుర్తుంటారని పేర్కొన్నారు. శ్రీరాములు త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాందీ అని సీఎం అన్నారు.


ఏ భాష మాట్లాడేవారిని ఆ భాష వారే పాలించుకునే అవకాశం రావాలని శ్రీరాములు కోరుకున్నారని గుర్తు చేశారు. తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆత్మార్పణ చేశారన్నారు. పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టింది తామేనని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి నంబర్‌ 1 రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. శ్రీరాములు పేరుతో మెమోరియల్‌ ట్రస్టు కూడా ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ రోజుకి 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టామని వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతినెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపడతామన్నారు. అప్పటికి 125వ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయని చంద్రబాబు అన్నారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 06:00 AM