Suryakumar Yadav: సూర్యని ‘మిస్టర్ 360’గా అభివర్ణించడంపై ఏబీ డివిలీయర్స్ స్పందన..
ABN , First Publish Date - 2022-11-07T16:41:12+05:30 IST
టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, ‘మిస్టర్ 360’గా క్రికెట్ ఫ్యాన్స్ అభివర్ణిస్తున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు.
టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, ‘మిస్టర్ 360’గా క్రికెట్ ఫ్యాన్స్ అభివర్ణిస్తున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ (t20 worldcup) సూపర్-12 దశలో ఇప్పటికే 3 అర్ధసెంచరీలు పూర్తి చేశాడు. ఆదివారం జింబాబ్వేపై మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 4 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ దూకుడు ఫలితంగానే టీమిండియా స్కోరు 180 మార్క్‌ను దాటగలిగింది. ఆ తర్వాత జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో భారత్ విజయం.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై పోరు ఖరారయ్యాయి. ఇవన్నీ పక్కనపెడితే.. జింబాబ్వేపై సూర్యకుమార్ యాదవ్ ఆడిన షాట్లు చర్చనీయాంశమయ్యాయి. మైదానం నలుమూలలా అతడు కొట్టిన షాట్లపై క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యని అందుకే ‘మిస్టర్ 360’గా పిలుస్తున్నామని తెగ పొగిడేస్తున్నారు. అయితే సూర్యకు ముందు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను (AB de Villiers) ‘మిస్టర్ 360’గా క్రికెట్ పండితులు అభివర్ణించేవారు. అయితే తనను ఏబీ డివిలీయర్స్తో పోల్చడంపై జింబాబ్వేపై మ్యాచ్ అనంతరం సూర్య స్పందించాడు.
‘ప్రపంచంలో ఒకే ఒక్క ‘360-డిగ్రీ ప్లేయర్’ ఉంటాడు. నేను అతడిలా ఆడడానికి ప్రయత్నిస్తా’’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జింబాబ్వేపై మ్యాచ్ అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. అయితే సూర్య చేసిన ఈ వ్యాఖ్యపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ‘‘ నువ్వు చాలా వేగంగా ఆ స్థానానికి చేరుకుంటున్నావ్ డ్యూడ్ !. ఇంకాస్త ఎక్కువే! ఈ రోజు చాలా బాగా ఆడావు’’ అని ట్వీట్ చేశాడు. జింబాబ్వేపై మ్యాచ్‌లో సూర్య ఆటతీరుని ఉద్దేశించి డివిలీయర్స్ ఈ విధంగా స్పందించాడు.
కాగా జింబాబ్వేపై చేసిన అర్ధసెంచరీ సూర్యకుమార్ యాదవ్‌కి ఈ ప్రపంచకప్‌లో మూడవది. కాగా జింబాబ్వేపై మ్యాచ్‌లో డీప్ ఫైన్ లెగ్‌లో సిక్సర్ కొట్టడంపై మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ఇలాంటి స్ట్రోక్స్ ఆడేందుకు ఎలా సన్నద్ధమవుతాడో తెలిపాడు. బౌలర్ ఎలా ఆలోచిస్తాడో తానూ అలానే ఆలోచించి షాట్‌కు సిద్ధమవుతానని చెప్పాడు. రబ్బర్ బాల్ క్రికెట్ ఆడేటప్పటి నుంచి ఇలానే చేసేవాడినని వెల్లడించాడు.
Read more