Outer Ring Road: హైదరాబాద్‌కు పచ్చలహారం

ABN , First Publish Date - 2022-11-17T11:26:11+05:30 IST

హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చలహారంగా మారింది. సెంట్రల్‌ మీడియన్‌తో పాటు

Outer Ring Road: హైదరాబాద్‌కు పచ్చలహారం

ఈ ఏడాది నాటిన మొక్కలు 4.50 కోట్లు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చలహారంగా మారింది. సెంట్రల్‌ మీడియన్‌తో పాటు ఇరువైపులా పెద్దఎత్తున నాటిన మొక్కలతో ఎటు చూసినా అంతా హరితమయంగా కనిపిస్తోంది. హరితహారంలో భాగంగా ఏటా కోట్లాది మొక్కల పెంపకం చేపట్టడంతో ఎనిమిది ఏళ్లలో వివిధ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. హెచ్‌ఎండీఏలోని అర్బన్‌ ఫారెస్టు విభాగం ఆధ్వర్యలో ఈ ఏడాది రూ.298 కోట్లు వెచ్చించి హరితహారం కింద రూ.4.50 కోట్ల మొక్కలను నాటారు. ఈ సీజన్‌లో 5 కోట్ల మొక్కలను 42 నర్సరీల్లో పెంచారు. ఔటర్‌, ఇంటర్‌చేంజ్‌లు, సర్వీస్‌ రోడ్‌, రైల్వే కారిడార్ల చుట్టూ 71.15 లక్షల మొక్కలు నాటి గ్రీన్‌ కారిడార్‌ అభివృద్ధి చేశారు. ఔటర్‌ వెంట ప్రతీ మొక్కకూ నీరందించేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి వల్ల ఏటా రూ.5.9 కోట్లు ఆదా అవుతున్నాయి.

ఎన్నో అవార్డులు

నగర శివారులోని ఫారెస్టు బ్లాక్‌లలో అర్బన్‌ లంగ్‌ స్పేస్‌గా గ్రీనరీని అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఆరు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని 16 చెరువుల ప్రాంతాలను కూడా ఆహ్లాదకరంగా మార్చారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, సంజీవయ్య పార్క్‌, నెక్లెస్‌ రోడ్‌ సహా 39 అర్బన్‌ పార్కులు లంగ్‌ స్పేస్‌లుగా అభివృద్ధి చెందాయి. నగరంలో పచ్చదనానికి ఇచ్చిన ప్రాముఖ్యతకు గుర్తింపుగా యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ), అర్బోర్‌ డే ఫౌండేషన్‌ ట్రీ సిటీ అవార్డులు దక్కాయి. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2021 నివేదిక ప్రకారం దేశంలో ఒక దశాబ్దంలో 48.66 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యధిక గ్రీన్‌ కవర్‌ను పొందిన మెగా నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా గ్రీన్‌ సిటీ అవార్డు దక్కించుకుని హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.

Updated Date - 2022-11-17T12:05:37+05:30 IST