ప్రాణం తీసిన రైల్వే గేట్
ABN , First Publish Date - 2022-11-18T23:13:24+05:30 IST
షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వేగేట్ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లుంటే బతికే వాడని కుటుంబ సభ్యులు రోధన చూసి సాధారణ జనం సైతం కంట తడి పెట్టారు.

గుండెపోటు రావడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక వ్యక్తి మృతి
చటాన్‌పల్లి రైల్వే గేట్ పడితే గంట వరకు ట్రాఫిక్ జాం
షాద్‌నగర్, నవంబరు 18 : షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వేగేట్ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లుంటే బతికే వాడని కుటుంబ సభ్యులు రోధన చూసి సాధారణ జనం సైతం కంట తడి పెట్టారు. ఈ విషాధ సంఘటన షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..
ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన దీర్షనం శ్రీశైలం అనే వ్యక్తికి ఉదయం 8 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అతడిని కారులో షాద్‌నగర్ ఆస్పత్రికి తీసుకువస్తుండగా పట్టణ మున్సిపల్ శివారులోని చటాన్‌పల్లి వద్ద ఉన్న రైల్వే గేట్ పడింది. ఎంత సేపటికీ రైల్ రాకపోవడంతో అక్కడి నుంచి కారును మల్లించి సోలిపూర్ మీదుగా షాద్‌నగర్ తీసుకువచ్చారు. కనీసం ఒక గంట పాటు సమయం వృధా కావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే శ్రీశైలం మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. రైల్వే గేట్ పడకుంటే తమ వాడు బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వేలాది వాహనాల రాకపోకలు
చటాన్‌పల్లి మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. షాద్‌నగర్ పట్టణం నుంచి హైదరాబద్, మహబూబ్‌నగర్ వెళ్లేందుకు, అలాగే షాద్‌నగర్ నుంచి బుచ్చిగూడ, ఎక్లా్‌సఖాన్‌పేట, జహంగీర్‌పీర్ దర్గా, వెలిజర్ల ఇలా పలు గ్రామాలకు ఈ రైల్వే గేట్ దాటి వెళ్లాల్సి ఉంది. చటాన్‌పల్లి రైల్వే గేట్ ఒక జంక్షన్‌గా మారడం, ఈ క్రమంలో గేట్ పడిందంటే సుమారు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలు హరించుకుపోతున్నాయి. దీంతో పాటు అత్యవసరంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు కూడా త్రీవ ఇబ్బందులు పడుతున్నారు.
శంకుస్థాపనకు నోచని అండర్‌పాస్
రైల్వే గేట్ నుంచి వాహనదారులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అండర్‌పాస్ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు జారీ చేయించారు. అయితే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంలో కొన్ని ఇళ్లను కూలగొట్టాల్సిన అవసరం ఉండటంతో స్థానికులు అడ్డు చెప్పారు. దీంతో ఇతర మార్గాల నుంచి బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు. ఇది జరిగి ఆరు నెలలు గడుస్తున్నా నేటికి అండర్‌పాస్ నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మాణం పనులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.