Share News

Chandrababu : అన్నదాతలూ.. అధైర్యపడొద్దు

ABN , First Publish Date - 2023-12-09T03:52:29+05:30 IST

మిచౌంగ్‌ తుఫాను కలిగించిన నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కృష్ణా పశ్చిమ డెల్టా రైతాంగానికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు.

Chandrababu : అన్నదాతలూ.. అధైర్యపడొద్దు

అండగా ఉంటా.. చంద్రబాబు భరోసా

పొలాల్లోకి వెళ్లి నష్టం పరిశీలన

మీ తరఫున ఈ ప్రభుత్వంపై పోరాడతా

3 నెలల తర్వాత ఈ సీఎం కచ్చితంగా ఉండడు

అప్పుడు పరిహారం బాధ్యత నేనే తీసుకుంటా

ప్రభుత్వ వైఫల్యం వల్లే అధిక నష్టమని ధ్వజం

కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలకు ఓదార్పు

గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటన

గుంటూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మిచౌంగ్‌ తుఫాను కలిగించిన నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కృష్ణా పశ్చిమ డెల్టా రైతాంగానికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు. అన్నదాతలు అధైర్య పడొద్దని, వారికి అండగా, తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. తుఫానుతో జరిగిన నష్టానికి పంట నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై పోరాడతానన్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మూడు నెలల తర్వాత కచ్చితంగా జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండడని, అప్పుడు రైతులకు నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అలాగని రైతులు ఇంట్లో కూర్చుంటే సరిపోదని, ఎక్కడికక్కడ అధికారులను, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపిచ్చారు. తుఫానుకు కకావికలమైన గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. మంగళగిరి, తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటలు కోల్పోయి కన్నీరుమున్నీరవుతోన్న రైతులను ఓదార్చారు. తొలుత ఉదయం మంగళగిరి నియోజకవర్గంలోని రేవేంద్రపాడు నుంచి తన పర్యటన ప్రారంభించారు. అక్కడ నీళ్లల్లో నానుతున్న వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు వచ్చారా అని ఆరా తీశారు. అనంతరం దుగ్గిరాల, తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామాల్లో నీళ్లలో నానుతున్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ‘సహజంగా ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రతిపక్షం ముందుకు రాకూడదు. వస్తే రాజకీయం చేయడానికి వచ్చిందని నిందలు మోపుతారు. ఈ తుఫాను వెలిసిపోయి మూడు రోజులు గడిచినా ముఖ్యమంత్రి వస్తాడేమోనని చూశా. ఎలాంటి కదలికా లేకపోవడంతో నేను కూడా రాకపోతే రైతులకు అన్యాయం చేసినట్లు అవుతుందని నా షెడ్యూల్‌ ప్రకటించాను. ఆ వెంటనే సీఎం తిరుపతి వెళ్లి అక్కడి నుంచి నేరుగా బాపట్లలో పర్యటన పెట్టుకున్నారు. తుఫాను తీరం దాటి తీవ్ర ప్రభావం చూపించింది మంగళగిరి, తెనాలి, వేమూరులో అయితే ఆయన బాపట్లకు.. అది కూడా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లాడు. ముఖ్యమంత్రి అయితే భూమ్మీద తిరగడా.. ఆకాశంలోనే తిరుగుతాడా’ అని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రమంతటా ప్రభావం..

ఇదొక అసాధారణమైన తుఫాను. గతంలో తుఫాన్లు మూడు, నాలుగు జిల్లాల్లో ప్రభావితం చూపేవి. ఇది మాత్రం రాష్ట్రమంతటా చూపించింది. రైతులు జూలైలో నారుమడులు పెట్టుకుని రూ.9 వేలు ఎకరాకు ఖర్చు చేసి నాట్లకు సిద్ధమవుతుండగా కురిసిన వర్షాలకు నష్టపోయారు. నష్టపోయినవారిలో ఎక్కువమంది కౌలు రైతులే. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వకుండా సర్కారు తాత్సారం చేసింది. ఒక్క గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనే 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ఇక రాష్ట్రమంతటా ఎంత దెబ్బతిన్నాయో ఊహించవచ్చు. ఫసల్‌ బీమా యోజన 0.4 హెక్టార్లలో 16మందికే అమలవడం దౌర్భాగ్యం.

యథారాజా.. తథా అధికారులు

బాధ్యత లేని ప్రభుత్వం ఉంటే అధికారులు కూడా అలానే ఉంటారని అనడానికి ఇదొక ఉదాహరణ. చేతకాని ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క డ్రెయిన్‌లో పూడిక తీయలేదు. ఈ రోడ్లపై ప్రయాణిస్తుంటే నా కాన్వాయ్‌ ఉయ్యాలలా ఊగుతోంది. ప్రభుత్వ తీరుపై బాధ, ఆవేదన, కోపం ఉంది. తిట్టాలంటే ఇంతకంటే మనసు రావడం లేదు.

హుద్‌హుద్‌ వస్తే..

విశాఖలో హుద్‌హుద్‌ తుఫాను వచ్చినప్పుడు.. అక్కడే 10 రోజులు ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలందరిని గ్రామాలకు పంపించి సహాయ చర్యలను పర్యవేక్షించా. నగరం సాధారణ స్థితికి వచ్చాకే అక్కడి నుంచి కదిలాను. తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం వద్ద ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి రైతులకు అండగా నిలిచాను. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే, మంత్రి అయినా వచ్చారా? వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయి.. చేష్టలు గడప దాటడం లేదు. అలాంటి వారిని మీరు ఎన్నుకున్నారు.

దొంగ ఎద్దులను గుచ్చుతాం..

ఈ ప్రభుత్వం పని చేయని ఎద్దులాంటిది. మనం మడక దున్నుతుంటే దొంగ ఎద్దులు సరిగా పని చేయవు. దాంతో వాటిని ముళ్లతో గుచ్చుతాం. అవి కొంతదూరం వెళ్లి మళ్లీ మొరాయిస్తాయి. అప్పుడు తోక మెలిపెడతాం. ఆ తర్వాత కొంతదూరం వెళ్లి ఆగిపోతాయి. అప్పుడు వాటిని వదిలించుకుంటాం. అలానే ఈ ప్రభుత్వాన్నీ వదిలించుకునే సమయం వచ్చింది.

మేమిచ్చిన దాంట్లో సగమైనా ఇవ్వడం లేదు

ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు రైతులు, దెబ్బతిన్న పంటలు తదితర వాటికి ఇచ్చే నష్టపరిహారాన్ని సీఎం జగన్‌ భారీగా తగ్గించాడు. మా హయాంలో వరికి నష్టపరిహారం హెక్టారుకు రూ.20 వేలిచ్చాం. నేడు రూ.15 వేలకు తగ్గించారు. ఎరువు ధరలు, ట్రాక్టర్‌ ఖర్చులు పెరిగాయి. హెక్టారుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలివ్వాలి. ఈ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మరో 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నష్టపోయిన వారందరినీ ఆదుకుంటాం. మా హయాంలో ఆక్వా కల్చర్‌కు రూ.30 వేలిస్తే జగన్‌ రూ.8,200కి తగ్గించారు. కనీసం రూ.50 వేలివ్వాలి. నాడు చనిపోయిన వారికి మేం ఇచ్చిన రూ.5 లక్షలే ఇస్తున్నారు. మేం ఉంటే రూ.10 లక్షలు ఇచ్చేవాళ్లం. గాయపడిన వారికి రూ.లక్ష ఇచ్చాం, వీళ్లు రూ.12,500 ఇస్తున్నారు. దాన్ని రూ.2 లక్షలకు పెంచాలి. ఇల్లు కూలిపోతే రూ.4 లక్షలతో ఇళ్లు కట్టించాం. నేడు రూ.లక్షా 20 వేలు ఇస్తున్నారు. అలా కాదు.. లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాలి. నేత కార్మికులు, మత్స్య కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వడంతో పాటు ఖర్చులకు రూ.5 వేలిచ్చాం. కానీ నేడు రూ. 2,500 ఇస్తారట! ఎన్ని సార్లు చెప్పినా జగన్‌రెడ్డికి అర్థం కాదు.

చేయని తప్పునకు క్షోభకు గురి చేశాడు

45 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నా ఎలాంటి తప్పు చేయలేదు. అయినా జైలులో పెట్టారు. నేనూ మనిషినే.. నాకూ బాధలుంటాయి.. చేయని తప్పునకు క్షోభకు గురి చేశాడు. ఇది గుర్తు పెట్టుకుంటా. 52 రోజుల పాటు ప్రజలు, దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా వీరోచితంగా నా కోసం పోరాడారు. మీ అభిమానాన్ని మరచిపోను. మీ రుణం తీర్చుకుంటా. రాష్ర్టాన్ని గాడిలో పెడతా. జగన్‌ ఆలోచన ఒక్కటే.. నన్నే ఇలా చేస్తే మీ అందరినీ బెదిరించవచ్చన్నది ఆయన ఏకైక లక్ష్యం. ఇలా విర్రవీగితే తెలంగాణలో ఏు గతి పట్టిందో.. మూడు నెలల తర్వాత.. ఈయనకూ అదే గతి.

బంగాళదుంపలు, ఉల్లిగడ్డకు తేడా తెలియదు

జగన్‌కు బంగాళ దుంపలు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘బాపట్ల సభలో ఆయన పొటాటో అంటే ఏమిటని అడగడం శోచనీయం. తెలియకపోతే కనీసం నేర్చుకోవాలి. ప్రజలు పొటాటో అంటే బంగాళ దుంపలు అని నేర్పించాలా..నీ దుంప తెగ.. మా కొంపలు కూల్చేశావు ఏమీ తెలియకుండా’ అని వ్యాఖ్యానించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్‌ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, నక్కా ఆనందబాబు, కన్నా, జీవీ ఆంజనేయులు, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌, గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-09T03:53:09+05:30 IST