Ambati: పవన్‌కు అసలు సంస్కారమే లేదు

ABN , First Publish Date - 2023-01-08T17:15:06+05:30 IST

చంద్రబాబు (Chandrababu)-పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ పెద్ద ఆశ్చర్యంగా లేదని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో

Ambati: పవన్‌కు అసలు సంస్కారమే లేదు
టీడీపీని ఎలా రక్షించాలన్న దానిపైనే చర్చ

అమరావతి: చంద్రబాబు (Chandrababu)-పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ పెద్ద ఆశ్చర్యంగా లేదని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు-పవన్ ప్రజాస్వామ్య పరిరక్షణపై చర్చించలేదు. టీడీపీని ఎలా రక్షించాలన్న దానిపైనే చర్చ జరిగింది. ఇది ఒక పవిత్రమైన కలయికగా చిత్రీకరిస్తున్నారు. పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు-పవన్‌కల్యాణ్ కలిస్తే బీజేపీ ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే పవన్ తమతోనే ఉన్నారు అని బీజేపీ చెబుతోంది. కందుకూరు (Kandukuru), గుంటూరు తొక్కిసలాటకు బాధ్యత ప్రభుత్వం వహించాలా? జీవో నెం.1ను తప్పు పట్టడం దుర్మార్గ ఆలోచన. పేద ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఉచితంగా ఇంకా ఇస్తామంటే వెళ్లరా..? దీనికి ప్రభుత్వ పథకాలు అందకపోవడానికి ఏంటి సంబంధం?. పవన్‌కు అసలు సంస్కారమే లేదు. బీజేపీతో పొత్తులో ఉండి బాబుతో లవ్‌లో ఉన్నాడు. బాబు-పవన్ కలిసి అనైతిక రాజకీయాలు చేస్తున్నారు. వారిద్దర్ని కలిపి జగన్ బంగాళాఖాతంలో పడేస్తాడు.’’ అని అంబటి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు-పవన్‌కల్యాణ్ భేటీలో జరిగింది ఇదే..!

హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అరాచకంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేతతో జనసేనాని సమావేశం అయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం ఇరు పార్టీల అధినేతలిద్దరూ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.

పవన్‌కల్యాణ్...

ఆంధ్రప్రదేశ్‌‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కుప్పం ఘటనపై చంద్రబాబుతో చర్చించినట్లు పవన్ తెలిపారు. ‘‘బ్రిటిష్‌ వాళ్లు తెచ్చిన జీవో నెం.1తో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాల హక్కులను జగన్‌ ప్రభుత్వం కాలరాస్తోంది. వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లకూడదనే జీవో నెం.1 తెచ్చారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధమన్నారు.. జగన్‌ బర్త్‌డేకు అవే వాడారు. వైసీపీకి ఒక రూల్‌.. ప్రతిపక్షాలకు మరొక రూలా?, ఇరిగేషన్‌ మంత్రికి పోలవరం గురించే తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలుసు. అందుకే కేసులు, గొడవలు, కుట్రలతో వైసీపీ విశ్వరూపం చూపిస్తోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్నా.’’ అని పవన్‌ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు...

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘‘జీవో నెం.1 తీసుకొచ్చి ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో జరగరానిది జరుగుతోంది. విశాఖలో ఆంక్షలు పెట్టి పవన్‌ను హింసించారు. ఇప్పటంలో పవన్‌ సభకు స్థలం ఇస్తే ప్రజల ఇళ్లను కూల్చేశారు. విశాఖలో నన్ను కూడా అడ్డుకున్నారు. జీవో నెం.1 పరిణామాలను ముందుగానే విశాఖలో చూశాం. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కుప్పం వెళ్తానంటే అడ్డంకులు సృష్టించారు. వైసీపీ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు ఘటనలు. కందుకూరు ఘటన పోలీసుల కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందా? కుట్ర, కుతంత్ర రాజకీయాలను తిప్పికొడతాం. ఏపీ అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే మా ఆఫీస్‌పై దాడులు చేశారు. ఏపీలో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారమైంది. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటైంది. ఇక అన్ని రకాల పోరాటాలు చేస్తాం.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-08T17:32:17+05:30 IST