Vijayawada: నేడు జగన్ కోర్టుకు హాజరు కావాలి... ఎన్ఐఏ కోర్టు..
ABN , First Publish Date - 2023-02-15T10:42:31+05:30 IST
కోడికత్తి కేసు (Kodi Kathi Case) విచారణ బుధవారం విజయవాడ ఎన్ఐఏ (NIA) కోర్టులో జరగనుంది. బాధితుడు జగన్ (Jagan), ప్రత్యక్షసాక్షి దినేష్ (Dinesh), జగన్ పీఏ కేఎన్‌ఆర్ (KNR) విచారణకు హాజరు కావాలని...
విజయవాడ: కోడికత్తి కేసు (Kodi Kathi Case) విచారణ బుధవారం విజయవాడ ఎన్ఐఏ (NIA) కోర్టులో జరగనుంది. బాధితుడు జగన్ (Jagan), ప్రత్యక్షసాక్షి దినేష్ (Dinesh), జగన్ పీఏ కేఎన్‌ఆర్ (KNR) విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాడి సమయంలో విశాఖ ఎయిర్ పోర్టు అసిస్టెంట్ కమాండ్‌ర్‌గా దినేష్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాయపూర్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోడికత్తి దాడి కేసులో దినేష్ మొదటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అయితే ఆయన తండ్రి మరణించడంతో గతంలో కేసు విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా నేడు సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు కేసు విచారణ వేగవంతం చేయాలని నిందితుడు శ్రీనివాసరావు తరుపు న్యాయవాది సలీం ఎన్ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ నేడు కడప స్టీలు ప్లాంటుకు రెండోసారి భూమి పూజ..
అధికారం చేపట్టిన కొత్తలో స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. మూడేళ్లలో పూర్తిచేసి 25వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు దాటింది. ఇక ఏడాదికి పదవీకాలం పూర్తికానుంది. అధికారం దిగిపోవడానికి ముందు మరోసారి ఇదే స్టీలు ప్లాంటు నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఒకే ఫ్యాక్టరీ నిర్మాణానికి రెండుసార్లు భూమి చేసిన ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇదొక్కటే కాదు... జిల్లాలో ఎడాపెడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. శిలాఫలకాలు ఆవిష్కరించారు. వీటిలో చాలా వరకు ఇంకా పునాదుల దశ దాటలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడల్లా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తూ వచ్చారు. ప్రతి యేటా వైఎస్ జయంతి, వైఎస్ వర్ధంతి, క్రిస్మస్ వేడుకలతో పాటు ఇతర ముఖ్య కార్యక్రమాలకు సీఎం జగన్ జిల్లాకు వచ్చేవారు. వచ్చిన ప్రతిసారీ వందల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులో, రోడ్లో, పరిశ్రమలో.. ఏదో ఒకదానికి భూమిపూజ చేశారు. సీఎం వచ్చినప్పుడల్లా కోట్లాది రూపాయల పనులకు భూమిపూజ చేస్తుంటే జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందని సగటు జిల్లా వాసి సంతోషపడ్డాడు. అందమైన రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు కృష్ణమ్మ సవ్వడులు, పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అందరూ ఆశించారు. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వెళ్లాల్సిన అవసరం లేదు, మన కడపలోనే వైద్యం అందుతుందని సంతోషించారు. అయితే ఈ మూడు సంవత్సరాల ఎనిమిది నెలల జగన్ పాలనలో భూమి పూజ చేసి పూర్తయినవి నామమాత్రమే. ముఖ్యంగా పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, కూడళ్ల అభివృద్ధి, కడపలో ఓ ప్రధాన రోడ్డు మినహాయిస్తే ప్రధాన అభివృద్ధి పనులలో ప్రగతి లేదు. భూమిపూజలు చేసినా, జీవోలు ఇచ్చినా నిధుల కేటాయింపు లేనిదే అడుగు ముందుకు పడదు. నిధులు లేకపోవడంతో పనులు ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొంది. సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు రానున్నారు. జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి రెండోసారి భూమిపూజలో పాల్గొననున్నారు.