Share News

వైసీపీ నేత భూదందా

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:49 AM

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వైసీపీ నేతలు ఆక్రమించేస్తున్నారు. వెలిగండ్ల మండలం చోడవరం గ్రామంలో సర్వే నెం.165లో 20ఎకరాల బీడు భూమిని ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత ఎలికా నారాయణయాదవ్‌ దర్జాగా కబ్జా చేశారు.

వైసీపీ నేత భూదందా
పశువుల బీడు భూమిని చదును చేసి సాగు చేసిన పంట

20 ఎకరాల పశువుల బీడు ఆక్రమణ

ఇతరులకు కౌలుకి ఇచ్చిన వైనం

గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

వెలిగండ్ల, డిసెంబరు 29 : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు వైసీపీ నేతలు ఆక్రమించేస్తున్నారు. వెలిగండ్ల మండలం చోడవరం గ్రామంలో సర్వే నెం.165లో 20ఎకరాల బీడు భూమిని ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత ఎలికా నారాయణయాదవ్‌ దర్జాగా కబ్జా చేశారు. రూ.లక్షలకు కౌలుకు ఇచ్చారు. ఈ ఆక్రమణ విషయమై రైతులు అధికారులకు ఫిర్యాదుచేసినా స్పందించలేదు. గురువారం గ్రామస్థులు తహసీల్దార్‌ వాసును ప్రశ్నించగా.. కబ్జాకు పాల్పడిన వ్యక్తి వద్ద హైకోర్టు ఆర్డర్‌ ఉందని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. పశువుల మేత భూమిపై వైసీపీ నేతకు హక్కు ఎలా ఉంటుందని నిలదీశారు. సాగు చేస్తున్న వ్యక్తిపై విచారణ చేయాలని కోరారు. ఇది గ్రామం మెత్తానికి పశువులకు మేత భూమి అని రైతులు తెలిపారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అండతో నారాయణయాదవ్‌ పశువుల బీడు భూమి ఆక్రమణకు ప్రయత్నించాడు. అప్పట్లో మేకల నారాయణ, చింతబోయిన మాలకొండయ్య, సూరపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జోగిపర్తి మస్తాన్‌, మాల్యాద్రి మరికొందరు రైతులు అడ్డుకున్నారు. అప్పుడు వారిపై వైసీపీ నాయకులు అక్రమ కేసులు నమోదు చేయించారు. అనంతరం నారాయణయాదవ్‌ భూమిని ఆక్రమించి కౌలుకు ఇచ్చాడు. ఈ విషయంపై గతంలో ఆర్డీవో, కలెక్టర్‌, తహసీల్దార్‌కి రైతులు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. గురువారం కూడా వారు తహ సీల్దార్‌కి వినతిపత్రం అందజేసి గ్రామానికి చెందిన బీడు భూమిని ఆక్రమణదారుడు నుంచి కాపాడి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమి పశువుల మేతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Dec 30 , 2023 | 12:49 AM