Share News

అట్లుంటది వైసీపీ వాడకం..!

ABN , First Publish Date - 2023-10-15T01:01:29+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో ఐటీ పరంగా చేసింది శూన్యం..! జగన్‌ ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కంపెనీ కూడా రాలేదు.

అట్లుంటది వైసీపీ వాడకం..!

ఆ సంస్థకు ప్రభుత్వపరంగా ఎటువంటి సాయం లేదు

స్థలం ఇవ్వలేదు...కనీస సహకారమూ అందించలేదు

టైర్‌-2 నగరాల్లో ఏర్పాటు లక్ష్యంగానే ఏర్పాటు

ఇప్పుడు దానికి సీఎం జగన్‌ చేతుల మీదుగా 16న ప్రారంభోత్సవం

ఈ పేరుతో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ప్రభుత్వం బిల్డప్‌

ముఖ్యమంత్రి వస్తున్నారని రోజూ ఐటీ శాఖా మంత్రి సమీక్షలు

రుషికొండపై నిర్మాణాలను మాత్రం కన్నెత్తి చూడని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో ఐటీ పరంగా చేసింది శూన్యం..! జగన్‌ ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కంపెనీ కూడా రాలేదు. అప్పటికే ఉన్న కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీ మొత్తం రూ.22 కోట్లలో రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోడ్‌ ముగియగానే రాయితీలు ఇస్తామని ఐటీ మంత్రి అమర్‌నాథ్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు స్థానికంగా మంచి ఉద్యోగావకాశాలే లేవు. ఉత్తరాంధ్రలో చదువు పూర్తయినవారు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లిపోతున్నారు.

కరోనా తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు చాలామంది స్వగ్రామాల నుంచి తిరిగి వెనక్కి రావడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ సంస్థ టైర్‌-2 నగరాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖలో ఒక కేంద్రం ఏర్పాటుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టింది. ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో ఉత్తరాంధ్రకు చెందిన వారిని ఇక్కడికి పంపాలనేది వారి ఆలోచన. అందుకే వెంటనే ఎటువంటి రిక్రూట్‌మెంట్‌ ఉండదని యాజమాన్యం ఆనాడే ప్రకటించింది. తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలోనూ ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ చేయడం లేదని ఆ సంస్థ వెల్లడించింది. అంటే కొత్తగా ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు ఇప్పట్లో రావన్నమాట.

నాడు సహకరించని ప్రభుత్వం

ఇన్ఫోసిస్‌ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం వెదుకుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సరైన సహకారం అందలేదు. వారే సొంతంగా భవనం తీసుకొని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ప్రాథమిక ప్రారంభోత్సవం కూడా ఆగస్టులోనే జరిగిపోయింది. కానీ ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి, ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు బిల్డప్‌ ఇవ్వడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న సీఎంతో దాన్ని ప్రారంభింపజేయాలని నిర్ణయించారు. ఒక ప్రైవేటు సంస్థ ప్రారంభోత్సవానికి సీఎం వస్తే దానికి ఏర్పాట్లు ఆ సంస్థే చేసుకుంటుంది. భద్రతాపరమైన ఏర్పాట్లు ఏమైనా ఉంటే పోలీసు విభాగం పర్యవేక్షిస్తుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌...ఇలా అంతా బృందాలుగా రోజూ అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారు. అలా చేయాలి...ఇలా చేయాలి అంటూ ఆదేశాలిస్తున్నారు.

రుషికొండను కూడా పరిశీలించవచ్చుగా..!

ఓ ప్రైవేటు సంస్థ ప్రారంభోత్సవానికి రోజూ వెళ్లి ఇంత హడావుడి చేస్తున్నవారు... రుషికొండపై నిర్మితమవుతున్న సీఎం క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల విశాఖ ప్రజలు విస్తుపోతున్నారు. అది ప్రభుత్వ నిర్మాణం. ప్రజాధనం వెచ్చిస్తున్నారు. ప్రతిపక్షాలను ఎలాగూ రానివ్వడం లేదు. కనీసం అధికార పార్టీ నాయకులు, అధికారులు కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం ఎలా నిర్మాణమవుతుందో ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మంత్రులకు, వైసీపీ నాయకులకు లేదా..? అని విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రులకు, అధికారులకు ధైర్యం సరిపోకపోతే...16న ఇక్కడకు వచ్చే సీఎం జగన్‌ అయినా సరే అక్కడి నిర్మాణాలను పరిశీలించి, వాటి చిత్రాలను విడుదల చేయాలని కోరుకుంటున్నారు.

Updated Date - 2023-10-15T01:01:29+05:30 IST