వైసీపీకి షాక్
ABN , First Publish Date - 2023-09-01T00:26:51+05:30 IST
వైసీపీలో ముసలం మొదలైంది. కీలక నాయకులు సైతం ఆ పార్టీకి దూరమవుతున్నారు. పాడేరు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పరిశీలకుని పదవికి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు.

వైసీపీకి షాక్
గంట్యాడ మాజీ ఎంపీపీ రాజీనామా
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీలో ముసలం మొదలైంది. కీలక నాయకులు సైతం ఆ పార్టీకి దూరమవుతున్నారు. పాడేరు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పరిశీలకుని పదవికి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను జిల్లా పార్టీ అధ్యక్షునికి గురువారం పంపించారు. ఈయన 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గజపతినగరం అసెంబ్లీ టీడీపీ టిక్కెట్టు ఆశించారు. అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈయన సోదరుడు కేఏ నాయుడున్నారు. అధిష్టానం టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఖరారు చేసింది. దీంతో నొచ్చుకున్న కొండలరావు ఎన్నికలకు ముందే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అయితే వ్యక్తిగత కారణాలు, వైసీపీలో మునుపటి విధంగా క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్న కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడుతో కలిసి కొండలరావు చంద్రబాబును మంగళగిరిలో గౌరవ పూర్వకంగా కలిశారు. కొండలరావు, కేఏ నాయుడు కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నేపథ్యం ఉంది. వీరి తండ్రి కొండపల్లి పైడితల్లినాయుడు టీడీపీ హయాంలో బొబ్బిలి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. తరువాత కేఏ నాయుడు గజపతినగరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొండలరావు గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు.