వాడీవేడిగా..
ABN , First Publish Date - 2023-11-29T23:54:11+05:30 IST
మున్సిపల్ సాధారణ సమావేశంలో అఽధికార పక్షానికి చెందిన చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులపై ప్రశ్నలు సంధించి ముచ్చెమటలు పట్టించారు

సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకని టీడీపీ కౌన్సిలర్ల వాకౌట్
చైర్‌పర్సన్, అధికారుల తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్ల అసహనం
పార్వతీపురం టౌన్, నవంబరు 29 : మున్సిపల్ సాధారణ సమావేశంలో అఽధికార పక్షానికి చెందిన చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులపై ప్రశ్నలు సంధించి ముచ్చెమటలు పట్టించారు టీడీపీ కౌన్సిల్ సభ్యులు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అధికార పార్టీకి పాలకవర్గ సభ్యులు అజెండాను చదివి వినిపించకుండానే గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు. ఇంతలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, 14వ వార్డు కౌన్సిలర్ డి.శ్రీదేవి కల్పించుకుని.. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కొద్ది రోజుల కిందట పార్వతీపురంలో జరిగిన వైసీపీ బస్సు యాత్ర కారణంగా మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిఽధుల ఆదేశాలతో పట్టణ ప్రధాన రహదారిలో మొక్కలు, చెట్లను నరికించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం పాలకవర్గ సభ్యుల ఆమోదం లేకుండా ఎలా తొలగించారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించకుండా తొలగించిన చెట్ల స్థానంలో నూతనంగా మొక్కలు నాటేందుకు మున్సిపల్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు బయో టాయిలెట్స్ నిర్మించాలని గత రెండేళ్లుగా కోరుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు ఎలాగో ఇవ్వడం లేదని, వారు చెల్లించిన డబ్బులు ఏమైయ్యాయో తెలియజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీడీపీ కౌన్సిల్ సభ్యులు శ్రీదేవి, సరిత, నారాయణరావు వాకౌట్ చేశారు.
జారుకున్న వైసీపీ కౌన్సిలర్లు..
మరోవైపు సమావేశంలో టేబుల్ అజెండా చదవకుండానే అధికార పక్ష కౌన్సిలర్లు ఒక్కొక్కరిగా జారుకుంటుండడంతో చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించరా అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులే నిబంధనలను ఉల్లంఘించడం సరికాదన్నారు. 25వ వార్డు కౌన్సిలర్ నిమ్మకాయల సుధీర్‌తో పాటు మరికొంతమంది అధికార పార్టీ కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేస్తూ.. రెండున్నరేళ్లగా తమకు అవమానాలే ఎదురవుతున్నాయని తెలిపారు. కనీసం పాలకవర్గ సభ్యులను పిలవకుండా.. పట్టణ ప్రధాన రహదారిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపడితే.. చైర్‌పర్సన్‌గా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో చైర్‌పర్సన్ టేబుల్ అజెండా చదవకుండానే సాధారణ సమావేశం ముగిసినట్లు ప్రకటించి తన చాంబర్‌కు వెళ్లిపోయారు.