216 రహదారిలో టోల్ బాదుడు
ABN , First Publish Date - 2023-09-26T23:51:27+05:30 IST
జిల్లాలో తీర ప్రాంతం వెంబడి అభివృద్ధి చేసిన 216 జాతీయ రహదారిపై మంగళవారం నుంచి టోల్ బాదుడు మొదలైంది.
కారుకు రూ.40, లారీకి రూ.140
నరసాపురం, సెప్టెంబరు 26 :జిల్లాలో తీర ప్రాంతం వెంబడి అభివృద్ధి చేసిన 216 జాతీయ రహదారిపై మంగళవారం నుంచి టోల్ బాదుడు మొదలైంది. జిల్లాలో చించినాడ నుంచి భీమవరం మండలం లోసరి వరకు సమారు 51 కిలోమీటర్లు 216 జాతీయ రహదారి అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు వాహనదారులు ఎటువంటి ట్యాక్స్ చెల్లించడం లేదు. ఇటీవల మొత్తం పనులన్నీ పూర్తవ్వడంతో మండలంలోని సీతారాంపురం వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను మంగళవారం నుంచి ప్రారంభించారు. ఇక నుంచి కారుకు రూ.40 సింగిల్, అదే రోజు తిరుగు ప్రయాణం ఉంటే రూ.60 చొప్పున వసూలు చేయనున్నారు. బస్సుకు రూ.130, కమర్షియల్ వాహనానికి రూ.140, ఆరు చక్రాల వాహనానికి రూ.205, ఏడు చక్రాలు దాటిన వాహనం సింగిల్ ట్రిప్‌కు రూ.250 టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. చెక్‌పోస్టుకు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటే వాహనదారులు నెలవారీ పాస్ తీసుకునే వెసులుబాటు ఉంది. దీనికి వాహనాన్ని బట్టి పన్ను వసూలు చేయనున్నారు.