వైసీపీకి ‘లోకల్‌ షాక్‌’

ABN , First Publish Date - 2023-02-06T00:46:47+05:30 IST

ఒకప్పుడు వాళ్లే అధిపతులు. ఊరంతటిని గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పేవారు. నా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహారాలు నడిచేవి. ఎమ్మెల్యే, ఎంపీ, ఆఖరుకి మంత్రి అయినా సరే వారికే సలాం చేసేవారు.

వైసీపీకి ‘లోకల్‌ షాక్‌’

నిధులు, విధులు లేక కుమిలిపోతున్న స్థానిక నాయకత్వం

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడో చేతులెత్తేశారు

ఎంపీ ఫండ్స్‌కు దిక్కులేదు.. వలంటీర్లు, గృహ సారఽధిల పెత్తనం

అధికార వైసీపీకి ఇక ముందు సహాయ నిరాకరణే

ఒకప్పుడు వాళ్లే అధిపతులు. ఊరంతటిని గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పేవారు. నా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహారాలు నడిచేవి. ఎమ్మెల్యే, ఎంపీ, ఆఖరుకి మంత్రి అయినా సరే వారికే సలాం చేసేవారు. గడిచిన కొన్నాళ్ళుగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా తిరగబడింది. సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇలా స్థానిక నాయకత్వం అలవోకగా బలహీనపడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరంతా రాజకీయాల్లో తామంతా మసకబారడానికి అధికార వైసీపీయే కారణమంటూ ఆగ్రహంతో ఉన్నారు. తగ్గట్టుగానే బదులు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ అధిష్టానం ఇదీ గ్రహించింది. ఇప్పుడిప్పుడే కాస్తంత బుజ్జగింపులు ఆరంభమయ్యాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

గ్రామ సర్పంచ్‌ అంటే ఒకప్పుడు కింగ్‌ మేకర్‌. స్థానిక నాయకత్వాన్ని కంటి చూపుతో శాసించేవారు. ఒక్క మాటతోనే అల్లాడించేవారు. కట్టుబాటు తప్పితే పరుగులు పెట్టించేవారు. ఆ తరువాత క్రమేపీ కొంత మార్పు వచ్చి ఎన్టీఆర్‌ హయాంలో మండల పరిషత్‌లు వచ్చిపడ్డాయి. ఎంపీటీసీలు, జడీపటీసీల ప్రాధేశిక నియోజకవర్గాలకు అంకురార్పణ జరిగింది. ఒకప్పుడు ఈ వ్యవస్థే ప్రజలకు అత్యంత చేరువయ్యింది. ఎంపీపీ, జడ్పీటీసీలు చేసేవారే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. దశాబ్దాల తరబడి ఇదంతా ఒక క్రమపద్ధతిలో నడిచింది. స్థానికంగా అభివృద్ధి జరిగింది. సర్పంచ్‌లు కాస్తంత బెటర్‌ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తే, ఎంపీపీ, జడ్పీటీసీ వంటి వారంతా బ్రహ్మాండంగా చేస్తున్నారంటూ పొగడ్తలు కురిసేవి. రానురాను ఈ పరిస్థితి అంతా మారింది. అధికార వైసీపీ సచివాలయ వ్యవస్థను తెచ్చిపెట్టింది. ఇదే తరుణంలో పంచాయతీరాజ్‌ విభాగంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రతిష్ట బసకబారడం ఆరంభించింది. గడిచిన రెండేళ్ళుగా పరిస్థితి తల్లకిందులైంది. గ్రామ సర్పంచ్‌లు తమంతట తాముగా కూడబలుక్కుని తమ ఊరికి ఏం కావాలో నిర్ణయించి చకచకా పనులు కానిచ్చేవారు. కాని రెండేళ్ళ క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సానుకూలురే అత్యధికంగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వారితోపాటు 46 మంది ఎంపీపీలుగాను, జడ్పీటీసీలుగాను అదే పార్టీకి చెందిన వారు గెలుపొందారు. ఎంపీటీసీల విషయానికొస్తే 863కు గాను వైసీపీ ఏకంగా 673 మంది అనుకూలురే విజయం సాధించగలిగారు. తొలుత స్థానిక సమరంలో తమకు తిరుగు లేదన్నట్టుగా విర్రవీగారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదలైన అనంతరం డొల్లతనం కాస్తా బయటపడింది. పంచాయతీల అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు కాస్తా కరెంటు బిల్లుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించింది. రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఖజానాకు చేరాయి. తమకు చెప్పకుండానే ప్రభుత్వమే విపరీత జోక్యం చేసుకుని ఏకపక్షంగా వ్యవహరిం చిందంటూ అప్పట్లో సర్పంచ్‌లు లోలోన అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిధుల కేటాయింపులో అంతా గందరగోళమే నడుస్తుంది. రెండో విడత వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లోను 40 శాతం మేర సర్పంచ్‌ల చేత బలవంతంగా చెక్కులు రాయించి కరెంటు బిల్లుకే జమ అయ్యేలా చూశారు. ‘సర్పంచ్‌గా ఎన్నికై రెండేళ్ళు దాటింది. ఈ ఊరికి ఏం చేశారని అడిగితే నోరెళ్ళ బెట్టాల్సిందే. వచ్చే నిధులు ఎక్కడె క్కడికో మళ్ళుతున్నాయి. మరి సర్పంచ్‌లుగా మేముండి ఏం చేయాలి. కనీసం మేమేం తిప్పలు పడుతున్నామో తెలుస్తుందా’ అంటూ సర్కారుపై మండిపడు తున్నారు. జిల్లా వ్యాప్తం గా ఈ తరహా అసంతృప్తి జ్వాలలు డెల్టా ప్రాంతంలోనే అత్యధి కం. సర్పంచ్‌లుగా ఎన్నికకావ డానికి కొందరు ఎన్నికల సమయంలో లక్షలు పోశారు. తీరా ఊరి అభివృద్ధికి వచ్చే సరికి విషయం కాస్తా తిరగబడు తుంది.

ఎంపీపీలదీ అదే పరిస్థితి

మండలం అంతా ఒక యూనిట్‌గా అటు రాజకీయాలను గాని, ఇటు నిధుల కేటాయింపుల్లోనూ ఒకప్పుడు మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీలు) చక్రం తిప్పేవారు. మండల సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి తాము అనుకున్నది సాధించేవారు. ఆఖరుకు ఎమ్మెల్యేలను కూడా ఎంపీపీ సమావేశాల్లోనే గట్టిగా డిమాండ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడాలేనేలేదు. గడిచిన ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను వైసీపీ చేజిక్కించుకుంది. ఎమ్మెల్యేలది కూడా అంతే స్థాయిలో ఉండడంతో ఇక ఏకరీతిన అభివృద్ధి జరుగుతుందనుకున్నారు. కాని దీనికంతా విరుద్ధం. మండల ప్రజాపరిషత్‌లు దాదాపు నామమాత్రంగా మారాయనే విమర్శలు ఉన్నాయి. మండల స్థాయిలో ప్రతీ అంశాన్ని చర్చించి అత్యవసరం అయ్యే పని పూర్తయ్యేలా ఇంతకుముందు ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేసేవారు. సంబంధిత మంత్రుల వద్దకు వెళ్ళి తగు రీతిలో సాధించేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మండల ప్రజాపరిషత్‌లు ఒక ఫార్స్‌గా మారాయి. సర్పంచ్‌లు సైతం సమావేశాల్లో నీరసపడడం, ఎంపీటీసీలు గళం విప్పకపోవడం వంటి పరిస్థితులన్నీ ప్రస్తుతం ఉన్నాయి.

ఫ్యాన్‌కు ఎదురుగాలి

గడిచిన కొన్నాళ్లుగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వారంతా అధికార వైసీపీపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ పాత్రను తేలిగ్గా తీసుకోవడం, సంప్రదింపుల్లోను అలవోకగా తీసిపారేయడం వంటి చర్యలను వీరు జీర్ణించు కోలేకపోతున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి నిధులు లభించినా క్షణాల్లో మాయమైపోవడం, అదంతా ప్రభుత్వ ఖజానాకు జమకావడం వీరికి నచ్చడంలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులను దృష్టిలో పెట్టుకుని ఎవరంతట వారుగా ఇప్పటిదాకా సైలెంట్‌గా ఉన్నారు. ఈ మధ్యనే తాడేపల్లిలో ఓ సమావేశం జరిగింది. ప్రతీ నియోజకవర్గం నుంచి ఒక అనుకూల సర్పంచ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రప్పించారు. వీరితో సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాల నాయుడు భేటీ అయ్యారు. మనలో మన మాట.. మీరంతా మనసు విప్పి మాట్లాడండంటూ సర్పంచ్‌లను కోరిందే తడవుగా హాజరైన వారంతా తీవ్ర అసంతృప్తి స్వరంతో విరుచుకుపడ్డారు. ‘సర్పంచ్‌గా ఎన్నికైంది దేనికి. ఏమైనా పనులు చేద్దామంటే డబ్బుల్లేవు. ఆఖరుకి ఎంపీలు ఎవరైనా కాస్తంత నిధులు విదిలిస్తారా అంటే అదీలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలగ చేసుకుని ఊరికి ఉపయోగకర పనులు చేస్తారా అంటే అదీలేదు. మరి ఇంకేం చేస్తారు. ప్రజల్లో పరిస్థితి అయితే బాగోలేదు’ అంటూ నేరుగానే తెగేసి చెప్పినట్టు సమాచారం. వీరి మాటలను ఆలకిస్తూనే అన్నీ సర్దుకుంటాయి, వచ్చే నెలనాటికైనా పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులన్నింటిని ప్రభుత్వం ఇస్తుంది. మీరు మాత్రం పార్టీ బలోపేతానికి, గెలుపు కోసం కష్టపడాల్సిందేనంటూ సజ్జల, ముత్యాలనాయుడు ముక్తాయింపు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇంత జరిగినా కూడా సర్పంచ్‌లు, ఎంపీపీ, జడ్పీటీసీ స్థాయిలో స్థానిక నాయకత్వం తీవ్ర అసంతృప్తిలో ఉంది. తమకు పట్టేమీ లేదన్నట్టుగా వలంటీర్లు, గృహ సారఽధిలతో పని పూర్తి చేసుకోవాలనుకుంటున్నారు కదా.. అలాగే కానివ్వండి. ఫలితాలు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుందంటూ పరోక్ష కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద అధికార వైసీపీకి లోకల్‌ లీడర్ల నుంచే అత్యధిక బెడద ఆరంభమైనట్టే. వారిలో ఉన్న అసంతృప్తి, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఒకింత ప్రయత్నం జరిగినా ఆ సమయంలో బయటపడిన ఆగ్రహావేశాలు ఈ ఏడాదంతా కొనసాగితే పార్టీకి నష్టదాయకమేనని భావిస్తున్నారు.

Updated Date - 2023-02-06T00:46:48+05:30 IST