సూత్రధారి ఆర్యసమాజ్, పాత్రధారి కాంగ్రెస్, కాల్బలం కమ్యూనిస్టు పార్టీ!

ABN , First Publish Date - 2023-05-25T03:24:55+05:30 IST

‘కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏప్రిల్ 26న నేను రాసిన వ్యాసం మీద సురవరం సుధాకర రెడ్డి మే 3న ‘సాయుధ పోరాటంపై

సూత్రధారి ఆర్యసమాజ్, పాత్రధారి కాంగ్రెస్, కాల్బలం కమ్యూనిస్టు పార్టీ!

‘కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు’ శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏప్రిల్ 26న నేను రాసిన వ్యాసం మీద సురవరం సుధాకర రెడ్డి మే 3న ‘సాయుధ పోరాటంపై అవాస్తవాలు, వక్రీకరణలు!’ అంటూ స్పందించారు. ‘వీర తెలంగాణపై విపరీత వ్యాఖ్యలు’ అంటూ ఆర్. రాజేశమ్ (మే 13), ‘మహత్తర పోరాటాన్ని ‘‘మతదృష్టి’’కి కుదిస్తారా?!’ అంటూ జతిన్ కుమార్ (మే 18) స్పందించారు.

వ్యాసానికి ‘కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు’ అని శీర్షిక పెట్టినప్పుడే అందులోని ఆరోపణలన్నీ కమ్యూనిస్టు పార్టీల నాయకుల మీదనేగానీ, పోరాటంలో పాల్గొన్న ప్రజల మీద కాదని అర్థం అవుతుంది. ఈ అంశాన్ని తారుమారు చేసి లబ్ధి పొందాలని విమర్శకులు ప్రయత్నాలు చేశారు.

ఒక ఉద్యమానికి అనేక పార్శ్వాలుంటాయి. సాధారణంగా ఆ ఉద్యమాల గురించి వ్యక్త సమూహాలన్నీ తమ సామాజిక అస్తిత్వం నుంచి రాస్తాయి. అప్పటికి అవ్యక్తంగా వున్న సమూహాలు కొన్నాళ్ళకు వ్యక్తంగా మారినప్పుడు తమ అస్తిత్వం నుంచి ఆ ఉద్యమాలను తిరగరాస్తాయి (Subaltern studies). 1984 ఢిల్లీ అల్లర్ల తరువాత భారత సామాజికరంగంలో అస్తిత్వ సమూహాలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే దశ ఆరంభం అయింది.

సాయుధ పోరాట పంథాను భారత కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా విరమణ చేసి, పార్లమెంటరీ పంథాను చేపట్టింది. అంతకు ముందు సాయుధ పోరాటానికి పిలుపిచ్చిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిటి రణదివెను ‘వామపక్ష దుందుడుకువాది’గా ముద్దరేసి ఏకంగా పార్టీ నుండి పంపించేసింది. ‘తెలంగాణలో రైతు కూలీ రాజ్య స్థాపన’ అనే లక్ష్యం నెరవేరకుండానే వీరోచితంగా విరమణ చేసిన పోరాటాన్ని ‘మహత్తర’ అనే నైతిక హక్కు భారత కమ్యూనిస్టు పార్టీకి లేదు. నైజాం చాలా పెద్ద సంస్థానం. అందులో తెలంగాణ ఒక భాగం. ఆ తెలంగాణలోనూ రెండు జిల్లాల్లో భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం ప్రధానంగా సాగింది. మిగిలిన జిల్లాల్లో జరగలేదని రాజేశమ్, జతిన్ కుమార్ ఇద్దరూ ఏదో విధంగా ప్రస్తావించారు. ఆ రెండు జిల్లాల్లోనూ ఏఏ తాలుకాల్లో వాస్తవంగా పోరాటం జరిగింది అని పరిశోధిస్తే పరిధి ఇంకా తగ్గుతుంది. ఆ రెండు జిల్లాలు ఆనాటి ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దులోనివి. సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని పట్టుబట్టింది కూడ ఆంధ్రా ప్రాంత నాయకులే. వాళ్ళను రావి నారాయణ రెడ్డివర్గం ‘బెజవాడ ముఠా’ (the Bezwada Clique) అంటూ ఎద్దేవా చేసేది. మొత్తం తెలంగాణ పోరాటాన్ని రావివర్గం వ్యక్తిగత హింసావాదం, అరాచక చర్యలుగా (The struggle was nothing more than individual terrorism and anarchist deeds) పేర్కొనేదని ఆనాటి మరో అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య తన గుణపాఠాల్లో రాశారు. (Chapter XI Withdrawal of Telangana Armed Partisan Resistance; Page 297). ఆ పోరాటంలో మితవాద ఆలోచనా ధోరణికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారని జతిన్ కుమార్ అంటే, వారిని మహానేతగా చిత్రించడానికి సురవరం చాలా తంటాలు పడ్డారు. ఇది మితవాదులు, అతివాదుల వివాదం.

ఆర్యసమాజ్, జాతీయ కాంగ్రెస్ రెండూ మొత్తం నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలనుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీతో పోలిస్తే ఆ రెండు సంస్థల కార్యక్షేత్రమూ పెద్దది; లక్ష్యమూ పెద్దది. కాంగ్రెస్‌ది రాజకీయ కారణం అయితే; ఆర్యసమాజ్‌ది మతకారణం. తమ సంపదను అపారంగా పెంచుకోవడానికి ఇండియన్ యూనియన్‌లో ఎక్కువ అవకాశాలుంటాయని తెలిసాక నిజాం సంస్థానంలోని భూస్వామ్య, పెట్టుబడీదారీవర్గాలు కాంగ్రెస్, ఆర్యసమాజ్‌లకు గట్టి మద్దతిచ్చాయి. మరోవైపు, కమ్యూనిస్టు పార్టీలోని మితవాదవర్గాన్ని కూడా ప్రోత్సహించాయి. నిజాం విలీనానికి సూత్రధారి ఆర్యసమాజ్, పాత్రధారి కాంగ్రెస్, కాల్బలం (infantry) భారత కమ్యూనిస్టు పార్టీ.

ఆత్మవిమర్శలో భాగంగానేకావచ్చు ఆనాటి పార్టీలోని అనేక తప్పుడు ధోరణులను డివి తన పుస్తకంలో రాశారు. వాటిల్లో, మత కోణం కూడ వున్నది అనేది ఒకటి. రాజకీయ పత్రాల్లోనేకాదు; తెలంగాణ పోరాట కథలు, నవలలు (దాశరథి రంగాచార్య), కవితలు, పాటలలోనూ (సుద్దాల హనుమంతు) మతపక్షపాతం కనిపిస్తుంది. మిగిలిన అంశాలకన్నా ఇవి ముస్లిం సామాజిక అస్తిత్వ సమూహానికి ముఖ్యమైనవి.

అస్తిత్వం అంటే పాలితుల వ్యవహారమేగానీ పాలకుల వ్యవహారం కాదు. నిజాం రాజరిక పాలనను ఆధునిక ముస్లింలు ఎవ్వరూ సమర్థించరు. నిజాం పాలనలో ముస్లింలు సహితం తీవ్ర అణచివేతకుగురయ్యారు. హిందువులు సహితం పెద్ద పెద్ద పదవుల్ని ఆస్వాదించారు. ఇతర సంస్థానాలతో పోలిస్తే నిజాం సంస్థానంలో ఆధునిక సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి అనేదీ కాదనలేని వాస్తవం.

సైనిక చర్యలో 3500మంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారు. ఇది కిరాతకం. అయితే, తెలంగాణలో కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే భారత సైన్యం ఉస్మానాబాద్, నాందేడ్, గుల్బర్గా, బీదర్ జిల్లాల్లో 3500 కన్నా భారీ సంఖ్యలో ముస్లింలను చంపేసింది. సామాజిక కార్యకర్త సుందర్ లాల్ బహుగుణ నాయకత్వాన అప్పటి ప్రధాని నెహ్రూ వేసిన అధికారిక నిజనిర్ధారణ కమిటి ఈ మేరకు ఓ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పుడు రిపోర్టు అందుబాటులో ఉంది. ఆ పార్శ్వాన్ని వీరు పట్టించుకోలేదు; ఆ నొప్పి వీరికి తెలీదు. అస్తిత్వ సమూహాలు హైదరాబాద్ నరమేధాన్ని కూడా పట్టించుకుంటాయి.

‘దేశానికి ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం ఆందోళనకరం’ అంటూ ముస్లిం సామాజిక దృక్పథంతో రాసిన వ్యాసాన్ని సుధాకరరెడ్డి ‘ఇస్లాం మత దృక్పథం’ అని ఆరోపించారు. నూరేళ్ళ కమ్యూనిస్టు పార్టీకి జాతీయ అగ్రనేతగా వెలిగిన వ్యక్తికి ‘ముస్లిం సామాజిక దృక్పథానికీ’, ‘ఇస్లాం మత దృక్పథానికీ’ తేడా తెలియకపోవడం విషాదకరం. భారతీయ ఫాసిజానికి అత్యంత బాధితులు ముస్లింలు. అసలు ఫాసిజం అనే పదమే ముగ్గురి వ్యాసాల్లో భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. అస్తిత్వ సమూహాలతో కమ్యూనిస్టు పార్టీలు సరిగ్గా వ్యవహరించలేదనే ప్రధాన ఆరోపణను అందరూ తెలివిగా దాటవేశారు.

భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవీ ఇంతవరకు భారత సమాజ స్వభావాన్ని, కుల మత తెగ వ్యవస్థల్ని అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడ చేయలేదు. శ్రామికవర్గం కూడ ఏదో ఒక సామాజిక అస్తిత్వంలోనే వుంటుందని అంగీకరించడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు ఇప్పటికీ ఏదో బయటికి చెప్పుకోలేని ఇబ్బందివుంది. కమ్యూనిస్టూ పార్టీల నాయకులకు ఇప్పటికీ ఫాసిజం–నాజిజం అంటే 1930ల నాటి ఇటలీ, జర్మనీలే గుర్తుకొస్తాయి. భారతీయ ఫాసిజం అంటూ ఒకటుంటుందనీ, దానికి ఇక్కడి మత అల్పసంఖ్యాకవర్గాలు ప్రధాన బాధితులుగా వుంటారని వాళ్ళ ఆలోచనలకు తట్టదు. ఇదీ అసలు విషాదం.

మతం గురించి కూడ కమ్యూనిస్టు పార్టీల నాయకులకు గందరగోళం ఉన్నది. మతానికి ఒక సామాజిక ప్రయోజనం ఉందన్నాడు మార్క్స్. కష్టకాలంలో నిస్సహాయులకు మతం ఒక ఉపశమనాన్ని ఇస్తుందన్నాడు. ఒక ప్రయోజనం ఉంది కనుకే అది సమాజంలో కొనసాగుతుందన్నాడు. సమాజంలో వర్గాలు నశించినపుడు నిస్సహాయులు ఉండరు కనుక వారికి ఉపశనం అందించాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడు మతం అంతరించి పోతుందన్నాడు. దీని సారాంశం ఏమంటే సమాజంలో వర్గాలు అంతరించాక మతం అంతరిస్తుందే తప్ప; మతం అంతరించాక వర్గాలు అంతరించవు. మన కమ్యూనిస్టు నాయకులు నాస్తికులకు ఎక్కువ; మార్క్సిస్టులకు తక్కువ. మతాన్ని బయట వదిలిపెట్టి పార్టీ మెట్లు ఎక్కాలని అంటుంటారు. సంఘపరివారం కూడ దాదాపు ఇదే మాటని కొంచెం కరుకుగా మైనారిటీలను అంటుంది. ఉపశమనంగా ఉన్న మతాన్ని కూడ వదులుకోవడం ఇష్టంలేక మైనారిటీ మత సమూహాలు కమ్యూనిస్టు పార్టీలకు దూరం అవుతున్నాయి.

ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చేయాల్సిందేమంటే తమ దేశాల్లోని మతవ్యవస్థల్లో వర్గ విశ్లేషణ చేయడం; ఏవి యజమాని మతాలో, ఏవి శ్రామికమతాలో నిర్ధారించడం. ఆపైన, శ్రామిక మత సమూహాల పక్షాన నిలబడడం. ఫాసిస్టు దశలో ఇది మరీ అవసరం. అంతే తప్ప మార్క్స్ మతం ఎప్పుడో అంతరించిపోతుందన్నాడు గాబట్టి మతాన్ని ఇప్పుడు పట్టించుకోము అని బిగుసుకుని కూర్చుంటే యజమాని మత ఆధిపత్యాన్ని పరోక్షంగా సమర్ధించినవారు అవుతారు. అంటే, తెలిసో తెలియకో ఫాసిస్టు శక్తుల్ని సమర్థించిన వారు అవుతారు.

భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవీ ఇంతవరకు భారత సమాజ స్వభావాన్ని, కుల మత తెగ వ్యవస్థల్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం కూడ చేయలేదు. శ్రామికవర్గం కూడ ఏదో ఒక సామాజిక అస్తిత్వంలోనే వుంటుందని అంగీకరించడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు ఇప్పటికీ బయటికి చెప్పుకోలేని ఏదో ఇబ్బందివుంది.

డానీ సీనియర్ పాత్రికేయుడు

Updated Date - 2023-05-25T03:24:55+05:30 IST