Share News

Diabetes: మధుమేహం తగ్గదనే అపోహపై తాజా అప్‌డేట్ ఇదే!

ABN , First Publish Date - 2023-11-14T10:54:05+05:30 IST

డయాబెటిక్‌ రివర్సల్‌’’ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న చికిత్సా పద్ధతి. ‘‘ వినటానికి బానే ఉంది.. కానీ ఒక సారి మధుమేహం వచ్చిన తర్వాత అది తగ్గుతుందా?

Diabetes: మధుమేహం తగ్గదనే అపోహపై తాజా అప్‌డేట్ ఇదే!

‘‘డయాబెటిక్‌ రివర్సల్‌’’ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న చికిత్సా పద్ధతి. ‘‘ వినటానికి బానే ఉంది.. కానీ ఒక సారి మధుమేహం వచ్చిన తర్వాత అది తగ్గుతుందా? ఇన్సులిన్‌ను వాడే వారు డోసేజ్‌ తగ్గించుకొనే అవకాశముందా?- ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతూ ఉంటాయి. వీటికి సమాధానం చెబుతున్నారు డాక్టర్‌ సౌజన్య.

మధుమేహం తగ్గుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు- అసలు మధుమేహ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మన శరీరంలో ఇన్సులిన్‌ అసలు ఉత్పత్తి కాకపోయినా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ సరిపోకపోయినా- మధుమేహం వస్తుంది. మధుమేహం ఒక సారి వచ్చిన తర్వాత దానిని నియంత్రణలో ఉంచటానికి మందులు లేదా ఇన్సులిన్‌ను వాడుతూ ఉంటారు. చక్కెర విలువలు తెలుసుకోవటానికి పరీక్ష చేసుకుంటూ లేదా చేయించుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ పద్ధతిని అనేక మంది పాటిస్తున్నారు. ఒకే రకమైన మందును ఏళ్ల తరబడి వాడేవారు కూడా అనేక మంది. దీనితో మధుమేహం తగ్గదనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మధుమేహంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. గ్లూకోజ్‌ విలువలను పరీక్షించటానికి అనేక ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కారణాల వల్ల మధుమేహంపై మనకు ఉన్న దృష్టి కోణం మారింది. దీని ఫలితమే ‘డయాబెటిక్‌ రివర్సల్‌’ చికిత్సా విధానం. దీని ద్వారా తాజాగా మధుమేహం వచ్చిన వారికి పూర్తిగా నయమయ్యే అవకాశముంటుంది. చాలా కాలంగా మధుమేహ చికిత్స తీసుకుంటున్నవారు మందుల డోసును తగ్గించుకొనే అవకాశం కలుగుతుంది.

అందుబాటులో..

మన శరీరంలో చక్కెర విలువలను తెలుసుకోవటానికి గ్లూకో మీటర్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి మన శరీరంలో చక్కెర విలువలు ఎలా ఉన్నాయో తెలియజేస్తాయి. అయితే వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వీటిని అధిగమించటానికి ఈ మధ్యకాలంలో కంటిన్యూయస్‌ గ్లూకోజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్స్‌ (సీజీఎంఎ్‌స)లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవస్థలో ఒక గ్లూకోజ్‌ మానిటర్‌ ఉంటుంది. దీనిని సీజీఎం వ్యవస్థకు అనుసంధానిస్తారు. ఈ మానిటర్‌ ద్వారా వ్యవస్థకు మన శరీరంలో వస్తున్న గ్లూకోజ్‌ మార్పులు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏ ఆహారం తింటే గ్లూకోజ్‌ విలువలు పెరుగుతున్నాయో.. ఏ సమయంలో గ్లూకోజ్‌ విలువలు పెరుగుతున్నాయో వంటి రకరకాల విషయాలు తెలుస్తాయి. ఒకప్పుడు ఈ మానిటర్స్‌ ఖరీదు ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో వీటి ఖరీదు బాగా తగ్గింది. సీజీఎంఎ్‌సల అందిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత- శరీర పనితీరు ఆధారంగా మందులను సూచించగలుగుతున్నారు. తాజాగా మధుమేహం నియంత్రణకు జీఎల్‌పీ1, ఎస్‌జీఎల్‌టీ మాలిక్యుల్స్‌ (ఇవి మూల మందులు. మార్కెట్‌లో వేర్వేరు పేర్లతో అందుబాటులో ఉన్నాయి) మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ మందుల వల్ల మధుమేహాన్ని నియంత్రించే పద్ధతే మారిపోయింది.

రకరకాలుగా..

మన శరీరంలోని క్లోమం (పేంకిరియా్‌స)లో బీటా సెల్స్‌ ఉంటాయి. ఇప్పటి దాకా మధుమేహం కోసే వాడే మందులు- ఈ క్లోమములో ఉండే బీటా సెల్స్‌పై పనిచేస్తూ ఉంటాయి. దీని వల్ల రకరకాల దుష్పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొత్త తరం జీఎ్‌సఎల్‌పీ1 మాలిక్యుల్స్‌ ఆకలిని తగ్గిస్తాయి. సాధారణంగా చాలా మంది ఆహారం ఎక్కువ తింటే ఆరోగ్యంగా ఉన్నామనుకుంటారు. ఆకలి వేసినా లేకపోయినా ఆహారాన్ని తింటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి చాలా మందికి ఒక అలవాటు! దీనిని నియంత్రించగలిగితే కణాలు విడుదల చేసే శక్తి నియంత్రణ కూడా జరుగుతుంది. గ్లూకోజ్‌ విలువలు కూడా తగ్గుతాయి. జీఎ్‌సఎల్‌పీ1 మాలిక్యూల్‌ ఆకలిని తగ్గిస్తే- దీని వల్ల ఆహారంపై నియంత్రణ ఏర్పడుతుంది.

అసలు సమస్య ఇదే..

జన్యు కారణాల వల్ల వచ్చే మధుమేహాన్ని పక్కనపెడితే- ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్లే మధుమేహం వస్తోంది. ఇది అన్ని వయస్సుల వారిలోను కనిపించటం ఒక ప్రమాదకరమైన సంకేతం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు - చాలా కాలంగా కొందరు రోజుకు మూడు సార్లు ఆహారం తినాలని నమ్ముతారు. దీని ద్వారా ఆరోగ్యంగా ఉంటామనుకుంటారు. మన శరీరానికి తగిన శక్తిని ఇవ్వటానికి ఇది ఒక మార్గం. అయితే మన శరీరానికి అవసరమైన శక్తి- మనం చేసే శారీరక శ్రమపై కూడా ఆధారపడి ఉంటుంది. తక్కువ శారీరక శ్రమ చేసేవారు ఎక్కువ ఆహారాన్ని తింటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. అదనంగా చేరిన గ్లూకోజ్‌ కాలేయంలోను, పొట్టలోను కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇలా అదనంగా పేరుకుపోవటాన్ని గ్లూకోటాక్సిటీ అంటారు. గ్లూకోజ్‌ అదనంగా పేరుకుపోవటం గమనించిన కణాలు- తమకు అంత శక్తి అవసరం లేదని క్లోమానికి సంకేతాలు ఇస్తాయి. తగినంత ఇన్సులిన్‌ను తీసుకోవు. ఇన్సులిన్‌ను తీసుకోకపోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ విలువలు పెరిగిపోతాయి. ఈ గ్లూకోజ్‌ విలువల నియంత్రణ కోసం శరీరంలోని వివిధ అవయాలు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో అవి కూడా దెబ్బతింటాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది.

ఏం చేయాలి?

అవసరమైన దాన్ని కన్నా ఎక్కువ ఆహారం తినకూడదు. అవసరమైన దాని కన్నా ఎక్కువ ప్రొటీన్‌ను తీసుకోకూడదు. ఏ ఆహారం తింటే గ్లూకోజ్‌ విలువలు పెరుగుతాయో గమనించాలి. చాలా మంది కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా మానేస్తే మధుమేహ సమస్య తగ్గిపోతుందనే అపోహలో ఉంటారు. ఇది నిజం కాదు. కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారాన్ని పూర్తిగా మానేస్తే- ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల సంతులిత ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా- కొన్ని ఆహార పదార్థాలను ఘన స్థితిలోనే తినాలి. ఉదాహరణకు చాలా మంది మధుమేహ రోగులు- రాగి జావ తినటం వల్ల ప్రయోజనం ఉందనుకుంటారు. కానీ రాగి ముద్ద తిన్నప్పుడు కలిగే ప్రయోజనం రాగి జావ తాగితే రాదు. ఇదే విధంగా పళ్లను తిన్నప్పుడు కలిగే ప్రయోజనం పళ్ల రసం తాగినప్పుడు రాదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మధుమేహానికి రివర్స్‌ గేర్‌ వేయటం సాధ్యమే!

MAIN-BIGsIZE.jpg

డయాబిటిస్‌ రివర్సల్‌ చికిత్సలో మూడు ప్రధానమైన అంశాలుంటాయి. మొదటిది గ్లూకోజ్‌ విలువలను ప్రతి క్షణం కనిపెట్టడం. దాని ద్వారా ఎలాంటి ఆహారం తింటే, ఎలాంటి పరిస్థితుల్లో గ్లూకోజ్‌ విలువలు పెరుగుతున్నాయి అనే విషయాన్ని విశ్లేషించటం. ఈ విశ్లేషణ ఆధారంగా నిర్ధిష్టమైన ఆహారాన్ని సూచించటం. మధుమేహం ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని విశ్లేషించి- కొత్త రకం మందులు ఇవ్వటం. వీటి ద్వారా గ్లూకోజ్‌ నియంత్రణతో పాటుగా ఆకలిని తగ్గించటం.. శరీర అవయవాలపై ఒత్తిడి లేకుండా చేయటం.

d.jpg

-డాక్టర్‌ ఎల్‌. సౌజన్య కూనపరెడ్డి

ఫౌండర్‌ అండ్‌ సీఈఓ

రిలివ్‌, ఖాజాగూడ, హైదరాబాద్‌.

Updated Date - 2023-11-14T10:54:09+05:30 IST