Bharat Jodo Yatra : నువ్వెవరు?... అమిత్ షాను నిలదీసిన ఖర్గే...
ABN, First Publish Date - 2023-01-06T18:14:47+05:30
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ఫై కాంగ్రెస్
న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ఫై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు ఓ రాజకీయ నాయకుడు, అంతేకానీ పూజారి కాదు. దేశాన్ని కాపాడటం, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం మీ కర్తవ్యం. దేవాలయం గురించి ప్రకటనలు చేయడం మీ కర్తవ్యం కాదు’’ అని పేర్కొన్నారు. హర్యానాలోని పానిపట్ వద్ద భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొన్న ఖర్గే శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా గురువారం త్రిపుర (Tripura)లో మాట్లాడుతూ, అయోధ్య రామాలయం (Ram Temple in Ayodhya) భక్తుల పూజలందుకోవడానికి వచ్చే ఏడాది జనవరి ఒకటినాటికి సిద్ధమవుతుందని చెప్పారు. రామాలయం నిర్మాణాన్ని కాంగ్రెస్ (Congress) కోర్టుల ద్వారా అడ్డుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖర్గే శుక్రవారం మాట్లాడుతూ, అమిత్ షాకు కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేయడంలో బీజేపీ (BJP)కి తీరిక ఉండటం లేదని ఖర్గే ఆరోపించారు. తమకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందన్నారు. బీజేపీవారు పచ్చి అబద్ధాలకోరులని మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చారని, కానీ ఎవరికీ ఉద్యోగాలు లేవని అన్నారు. రూ.15 లక్షలు ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో కూడా వారు విఫలమయ్యారన్నారు. ‘ఆపరేషన్ లోటస్’ (Operation Lotus) పేరుతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేస్తోందన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం బీజేపీ పోరాడలేదన్నారు. ప్రధాన మంత్రి 100 కార్లతో వెళ్తుంటారని, హోం మంత్రి 50 కార్లతో ప్రయాణిస్తుంటారని, తాము మాత్రం తమ కార్యక్రమాలకు వెళ్ళడానికి అనుమతులు పొందడానికి పోరాడవలసి వస్తోందని చెప్పారు.
Updated Date - 2023-01-06T18:14:52+05:30 IST