BBC raids: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేలపై విరుచుకుపడ్డ విపక్షాలు!.. ఒకే ట్వీట్‌తో తేల్చేసిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-02-14T16:22:30+05:30 IST
బీబీసీకి (BBC) చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వేలు నిర్వహించడంపై విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి.
న్యూఢిల్లీ: బీబీసీ (BBC) ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వేలు (IT Surveys) నిర్వహించడంపై విపక్ష పార్టీలు (Oppositions) భగ్గుమన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) డాక్యుమెంటరీ ప్రసారం చేసిన వారాల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడంపై విపక్ష నేతలు తమ గళం వినిపించారు. ఇప్పటికే కాంగ్రెస్ (congress), తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీఆర్ఎస్ (BRS), సమాజ్‌వాదీ (SP) పార్టీలు స్పందించాయి. సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఏవిధంగా స్పందించారో పరిశీలిద్దాం...
అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వేలు నిర్వహించడంపై కాంగ్రెస్ మండిపడింది. అదానీ వ్యవహారంలో జేపీసీ (Joint Parliamentary Committee) ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం బీబీసీ వెనుకాల పడిందని విమర్శించింది. అప్రకటిత ఎమర్జెన్సీగా అభివర్ణించింది. ‘‘ తొలుత బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. అది బ్యాన్ అయ్యింది. ఇప్పుడు బీబీసీపై ఐటీ సోదాలు జరిగాయి. అప్రకటిత ఎమర్జెన్సీ ఇది’’ అని కాంగ్రెస్ పార్టీ హిందీలో ట్వీట్ చేసింది. బీబీసీపై దాడులను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వీడియోను కూడా పోస్ట్ చేసింది.
వాట్ ఏ సర్‌ప్రైజ్: కేటీఆర్
‘‘ వాట్ ఏ సర్‌ప్రైజ్!. మోదీపై (Modi) డాక్యుమెంటరీ ప్రసారం చేసిన వారాల వ్యవధిలోనే బీబీసీ ఇండియాపై (BBC Inidia) ఐటీ సోదాలు (IT raids) జరిగాయి. బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన ఐటీ (IT), సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు హాస్యాస్పదమైపోయాయి. తర్వాత ఏంటి?. హిండెన్‌బర్గ్‌పై ఐటీ సోదాలు లేదా టేకోవర్ ప్రయత్నమా?’’ అని పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు బీబీసీపై ఐటీ సోదాలకు సంబంధించిన వార్తల గూగుల్ సెర్చ్ ప్రింట్‌స్ర్కీన్‌ను ఆయన షేర్ చేశారు.
ఎంత అనూహ్యం : మహువా మొయిత్రి
‘‘ వావ్, నిజమా?. ఎంత అనూహ్యం’’ అంటూ బీబీసీపై ఐటీ సర్వేల పట్ల టీఎంసీ కీలక నేత మహువా మొయిత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదానీ వ్యవహారాన్ని పక్కకు పెట్టారని వ్యాఖ్యానించారు.
సైద్ధాంతిక ఎమర్జెన్సీ: అఖిలేష్ యాదవ్
బీబీసీపై ఐటీ సర్వేలపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ పదునైన విమర్శ చేశారు. ‘‘బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులకు సంబంధించిన వార్తలు ‘సైద్ధాంతిక ఎమర్జెన్సీ’ని తలపిస్తున్నాయి’’ అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా.. బీబీసీ ముంబై, ఢిల్లీ కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం ఐటీ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది ఫోన్లను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు స్వాధీనం చేసుకుని, వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని కోరినట్లు తెలుస్తోంది. బీబీసీ వ్యాపార కార్యకలాపాలు, భారత దేశంలోని బీబీసీ శాఖకు చెందిన కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణల దృష్ట్యా ఈ సర్వేలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నా.. మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఇక మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. 2002లో గుజరాత్ అల్లర్లు, హింసాకాండ సమయంలో నాటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.