Rahul Gandhi : రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు దళాలు... ‘భారత్ జోడో యాత్ర’లో ప్రసంగం చిచ్చు...
ABN , First Publish Date - 2023-03-19T11:49:39+05:30 IST
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) నివాసానికి పోలీసులు ఆదివారం వెళ్ళారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) నివాసానికి పోలీసులు ఆదివారం వెళ్ళారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరారు. లైంగిక వేధింపుల గురించి ఆయనను ఎవరు ఆశ్రయించారో తెలియజేయాలని ఆయనకు ముందుగా నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలో పెట్టిన పోస్ట్‌ల ఆధారంగా ఈ కేసును నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పోలీసు బృందానికి ఢిల్లీ పోలీసు శాంతిభద్రతల విభాగం ప్రత్యేక పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా నాయకత్వం వహించారు.
రాహుల్ గాంధీ నివాసం వెలుపల హుడా మీడియాతో మాట్లాడుతూ, భారత్ జోడో యాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని, తమపై అత్యాచారాలు జరిగాయని చెప్పారని రాహుల్ గాంధీ జనవరి 30న కశ్మీరులో జరిగిన సభలో చెప్పారని తెలిపారు. ఆ బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చేయడం కోసం వారి వివరాలను తమకు ఇవ్వాలని ఆయనను కోరేందుకు వచ్చామని చెప్పారు. ఈ అంశంపై సమాచారాన్ని సేకరించేందుకు మార్చి 15న ప్రయత్నించామని, అప్పుడు విఫలమయ్యామని చెప్పారు. మార్చి 16న ఆయనకు నోటీసు పంపించామని తెలిపారు.
రాహుల్ గాంధీ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, మన దేశంలో మహిళలపై దాడులు ఇప్పటికీ జరుగుతున్నాయన్నారు. దీని గురించి మీడియా మాట్లాడటం లేదన్నారు. తన పాదయాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని చెప్పారు. తమపై సామూహిక అత్యాచారం జరిగిందని వారు తనకు చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను వారికి చెప్పానని, ఫిర్యాదు చేస్తే తమకు పెళ్లిళ్లు కావనే ఉద్దేశంతో, ఫిర్యాదు చేసేందుకు వారు తిరస్కరించారని తెలిపారు. ఈ మాటలను ఢిల్లీ పోలీసులు విచారణకు చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు.
ఇదిలావుండగా, రాహుల్ నివాసానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి :
Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు
Chandrababu: ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా?