Marina Beach: మెరీనాలో సొరంగం పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2023-09-02T08:23:11+05:30 IST
స్థానిక మెరీనా తీరంలోని లైట్ హౌస్(Light house) ప్రాంతంలో మెట్రో రైలుమార్గం కోసం సొరంగం తవ్వే పనులు శుక్రవారం

పెరంబూర్(చెన్నై): స్థానిక మెరీనా తీరంలోని లైట్ హౌస్(Light house) ప్రాంతంలో మెట్రో రైలుమార్గం కోసం సొరంగం తవ్వే పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నగరంలో ప్రస్తుతం రెండు మార్గాల్లో 55 కి.మీ మేర మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉండగా, రెండో విడతలో మూడు మార్గాల్లో 118 కి.మీ మేర మెట్రోరైలు మార్గం నిర్మాణపనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. అందులో మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ నుంచి పూందమల్లి బైపాస్ రోడ్డు(Poondamalli Bypass Road) వరకు 29.1 కి.మీ మేర నాలుగో రైలుమార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2025 జూన్‌లో ఈ మార్గంలో మెట్రోరైలు సేవలు ప్రారంభించాలని సీఎంఆర్‌ఎల్ లక్ష్యంగా నిర్ణయించింది. లైట్ హౌస్ నుంచి పూందమల్లి వరకు చేపట్టనున్న మెట్రోరైలు పనులు రెండు విడతలుగా చేపట్టనున్నారు. పూందమల్లి-పోరూర్, పోరూర్-లైట్ హౌస్(Poondamalli-Porur, Porur-Light House) వరకు రెండు విడతలుగా చేపట్టనున్న పనులను వేర్వేరు సంస్థలకు అప్పగించారు. మొదటి విడత పనులు (పూందమల్లి-పోరూర్) మధ్య జరుగుతుండగా, పోరూర్-లైట్ హౌస్ మధ్య రెండవ విడత పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. లైట్ హౌస్ నుంచి కచేరి రోడ్డు మీదుగా మైలాపూర్ వరకు కి.మీ వరకు సొరంగం తవ్వే పనులను ‘ఫ్లెమింగో’ పేరుతో ఎస్-1352 యంత్రం చేపట్టింది. ఈ పనులను సీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ సిద్ధిఖ్ ప్రారంభించారు.
