Prahlad Patel: ప్రజలు అడుక్కునేందుకు అలవాటు పడ్డారు.. మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్య
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:33 PM
ప్రజలు ఉచితాలకు, చేయి చాచి అర్థించేందుకు అలవాటు పడ్డారంటూ బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రజలు చేయి చాచేందుకు అలవాటు పడిపోయారన్న ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజగఢ్ జిల్లాలో వీరాంగన రాణి అవంతీబాయ్ లోధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించిన సందర్భంగా ప్రహ్లాద్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు (Madhya Pradesh Minister Sparks Row).
‘‘ప్రభుత్వం నుంచి అడుక్కుని తీసుకునేందుకు ప్రజలు అలవాటు పడిపోయారు. నేతలు వచ్చినప్పుడల్లా వారికి గంప నిండుగా అర్జీలు ఇస్తుంటారు. స్టేజ్‌పైన నేతలకు పూలమాలలు వేసి చేతుల్లో అర్జీలు పెడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఇలా అర్థించే బదులు ఇచ్చే అలవాటును పెంపొందించుకోవాలి. దీంతో, సమాజంలో సంస్కారం పెరగడంతో పాటు జీవితం ఆనందమయం అవుతుంది’’
PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి
‘‘ఇలా చేయిచాచే వారి వల్ల సమాజం బలహీనమవుతుంది. ఉచితాలపై ఆకర్షితులు కావడం ధీర మహిళల లక్షణం కాదు. అమరులను గౌరవించుకోవడం అంటే వారు చూపిన మార్గంల్లో వారి ఆదర్శాలకు అనుగూణంగా జీవించడమే. నిజమైన దేశభక్తులు చేయి చాచి అర్థించినట్టు మనం ఎక్కడైనా విన్నామా? నర్మదా పరిక్రమ యాత్రికుడిగా నేను దానాలు స్వీకరించా. కానీ అవి నా కోసం కాదు. నాకు ఏదైనా ఇచ్చానని చెప్పే వ్యక్తి ఎవరూ లేరు’’ అని అన్నారు.
Tax Distribution: పన్నుల వాటా తగ్గితే కేంద్రంపై పోరాటమే! కర్ణ్ణాటక సీఎం సిద్దరామయ్య
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు జీతూ పట్వావీ.. పటేల్ వ్యా్ఖ్యలను ఖండించారు. ఆయన రాష్ట్ర ప్రజలను అవమానించారని అన్నారు. ప్రజలను భిక్షగాళ్లనే స్థాయికి బీజేపీ వారి అహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రజలు కష్టాలు, ఆశలు, కన్నీళ్లను అవమానించారని అన్నారు. ‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే వాళ్లను బిక్షగాళ్లంటూ అవమానిస్తున్నారు. త్వరలో బీజేపీ నేతల ఓట్లు అడుక్కుంటూ వస్తారు’’ అని ఆయన అన్నారు.