Rozgar Mela : భారత దేశం అంటే నమ్మకం, ఆకర్షక కేంద్రం : మోదీ

ABN , First Publish Date - 2023-07-22T14:49:57+05:30 IST

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అమృత కాలంలో ప్రభుత్వోద్యోగిగా సేవలందించే అవకాశం రావడం గొప్ప గౌరవమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని భారతీయులు సంకల్పించారని తెలిపారు. మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన మూడు దేశాల్లో భారత దేశం ఒకటి కాబోతోందని ప్రతి నిపుణుడు భావిస్తున్నట్లు తెలిపారు.

Rozgar Mela : భారత దేశం అంటే నమ్మకం, ఆకర్షక కేంద్రం : మోదీ
Narendra Modi

న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అమృత కాలంలో ప్రభుత్వోద్యోగిగా సేవలందించే అవకాశం రావడం గొప్ప గౌరవమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని భారతీయులు సంకల్పించారని తెలిపారు. మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన మూడు దేశాల్లో భారత దేశం ఒకటి కాబోతోందని ప్రతి నిపుణుడు భావిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన కొత్తగా నియమితులైన దాదాపు 70 వేల మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందజేశారు.

దేశవ్యాప్తంగా 44 చోట్ల శనివారం రోజ్‌గార్ మేళాలు జరిగాయి. కొత్తగా నియమితులైన ఉద్యోగులు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో పని చేస్తారు. యువత సాధికారులవడానికి, దేశాభివృద్ధిలో వారు భాగస్వాములవడానికి రోజ్‌గార్ మేళా ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఉపాధి సృష్టికి కూడా ఈ మేళా దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

రోజ్‌గార్ మేళా ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ మేళాను మోదీ 2022 అక్టోబరు 22న ప్రారంభించారు. శనివారం జరిగిన మేళాలో ఆయన మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో దేశం అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వోద్యోగిగా పని చేసే అవకాశం పొందడం గొప్ప గౌరవప్రదమని చెప్పారు. పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ కల దేశాల్లో భారత దేశం ఒకటి అని చెప్పారు. గత యూపీయే ప్రభుత్వంలో మన దేశ బ్యాంకింగ్ రంగం ధ్వంసమైందని ఆరోపించారు. నేడు మనం డిజిటల్ లావాదేవీలను చేయగలుగుతున్నామని, తొమ్మిదేళ్ల క్రితం ఫోన్ బ్యాంకింగ్ దేశ ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని అన్నారు.

లాభాల బాటలో బ్యాంకులు

ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల్లో ఉండేవన్నారు. వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉండేవని, నిరర్థక ఆస్తులు ఉండేవని చెప్పారు. ఇప్పుడు ఆ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని చెప్పారు. యూపీయే ప్రభుత్వ హయాంలో చాలా కుంభకోణాలు జరిగాయని, వాటిలో ఒకటి ఫోన్ బ్యాంకింగ్ కుంభకోణమని చెప్పారు. ఓ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే వ్యక్తులు బ్యాంకులకు ఫోన్ చేసి, వేల కోట్ల రూపాయల రుణాలను పొందేవారన్నారు. ఆ రుణాలు తిరిగి చెల్లించేవారు కాదన్నారు. ప్రపంచానికి భారత దేశం పట్ల నమ్మకం పెరిగిందని, ఆకర్షక కేంద్రంగా భారత దేశం ఎదిగిందని చెప్పారు. దీనిని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నారు. తన ప్రభుత్వం బ్యాంకులను పటిష్టం చేయడం కోసం అనేక చర్యలు చేపట్టిందని, చిన్న బ్యాంకులను విలీనం చేసిందని చెప్పారు. ఈ రంగానికి ప్రొఫెషనలిజాన్ని జోడించినట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల బ్యాంకింగ్ రంగం బలోపేతమైందన్నారు.

బ్యాంకు ఉద్యోగులు కఠోర శ్రమ చేస్తారని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ‘ముద్రా’ పథకం క్రింద పేదలు, అవ్యవస్థీకృత రంగాల్లోనివారికి రుణాలు ఇచ్చి, సహాయపడటంలో వీరు అంకితభావంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. అదేవిధంగా మహిళల స్వయం సహాయక బృందాలకు కూడా వీరు మద్దతిస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Updated Date - 2023-07-22T14:49:57+05:30 IST