Sharad Pawar : ఎన్నికల గుర్తు మార్పుపై ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ సలహా
ABN, First Publish Date - 2023-02-18T13:57:43+05:30
శివసేన పార్టీ పేరును, దాని ఎన్నికల గుర్తు బాణం ఎక్కుపెట్టిన విల్లును ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల కమిషన్
ముంబై : శివసేన పార్టీ పేరును, దాని ఎన్నికల గుర్తు బాణం ఎక్కుపెట్టిన విల్లును ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల కమిషన్ (EC) కేటాయించడంపై ఎన్‌సీపీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించి, కొత్త గుర్తును తీసుకోవాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సూచించారు. పార్టీ గుర్తుపై ఈసీ నిర్ణయం ప్రభావం ప్రజలపై పెద్దగా ఉండబోదన్నారు. కొత్త గుర్తును ప్రజలు ఆమోదిస్తారని చెప్పారు.
శివసేన పార్టీ పేరును, దాని ఎన్నికల గుర్తును ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి ఎన్నికల సంఘం (Election Commission of India) కేటాయించడంతో శివసేన (Shiv Sena) ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) వర్గం కంగుతింది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది షిండే వెంటే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలకు కలిపి 47,82,440 ఓట్లు పోలవగా, షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు 36,57,327 ఓట్లు దక్కాయి. మొత్తం ఓట్లలో 76 శాతం షిండే వర్గానికి దక్కగా ఉద్ధవ్ వర్గానికి (Uddhav Thackeray faction) చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు 12 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. 2018లో శివసేన పార్టీ రాజ్యాంగంలో సవరణలను తమకు చూపించలేదని, అవి తమకు సమ్మతం కాదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని శివసేన తప్పుబట్టింది. వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే, బీజేపీ ఒత్తిడి కారణంగా షిండే వర్గానికి అనుకూలంగా ఈసీ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. అయితే ఎన్నికల సంఘం నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భిన్నంగా స్పందించారు. కొత్త పేరు, కొత్త సింబల్‌తో ప్రజా కోర్టుకు వెళ్తామన్నారు.
ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందిస్తూ, ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించి, కొత్త గుర్తును ఎంపిక చేసుకోవాలని ఉద్ధవ్ థాకరేకు సలహా ఇచ్చారు. ఈసీ నిర్ణయం ప్రభావం ప్రజలపై పెద్దగా ఉండదన్నారు. కొత్త గుర్తును ప్రజలు ఆమోదిస్తారని తెలిపారు. ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయమని, ఒకసారి నిర్ణయం వెలువడిన తర్వాత, ఇక దానిపై చర్చ ఉండకూడదని అన్నారు. దీనిని అంగీకరించి, కొత్త గుర్తును ఎంపిక చేసుకోవాలన్నారు. ఇందిరా గాంధీ కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాలం క్రితం తన ఎన్నికల గుర్తును మార్చుకోవలసి వచ్చిందన్నారు. కాంగ్రెస్ కొత్త గుర్తును ప్రజలు ఆమోదించినట్లుగానే ఉద్ధవ్ వర్గం పార్టీ గుర్తును కూడా ఆమోదిస్తారన్నారు. కాంగ్రెస్‌కు గతంలో కాడి, జోడెద్దులు గుర్తు ఉండేదన్నారు. ఆ తర్వాత చెయ్యి గుర్తు వచ్చిందన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించింది. తమదే నిజమైన శివసేన అని ఈసీ గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి :
George Soros Vs India : జార్జి సొరోస్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
Updated Date - 2023-02-18T13:57:52+05:30 IST