Tamil Nadu assembly : తమిళనాడు శాసన సభలో ఆశ్చర్యకర పరిణామం... వాకౌట్ చేసిన గవర్నర్...

ABN , First Publish Date - 2023-01-09T14:14:37+05:30 IST

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) శాసన సభ సమావేశాల నుంచి సోమవారం వాకౌట్ చేశారు.

Tamil Nadu assembly : తమిళనాడు శాసన సభలో ఆశ్చర్యకర పరిణామం... వాకౌట్ చేసిన గవర్నర్...
RN Ravi

చెన్నై : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) శాసన సభ సమావేశాల నుంచి సోమవారం వాకౌట్ చేశారు. ప్రభుత్వం ముద్రించి ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ఆయన చదవకపోవడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగం మాత్రమే రికార్డుల్లో నమోదు కావాలని కోరుతూ స్టాలిన్ ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్ళిపోయారు.

తమిళనాడు శాసన సభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. ఈ ప్రసంగాన్ని ప్రభుత్వం తయారు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని ఆర్ఎన్ రవి చదువుతూ, 65వ పేరాను చదవడం మానేశారు. దీనిలో ద్రవిడార్ కళగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రులు కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్‌ల గురించి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి పేర్కొన్న పేరాను కూడా గవర్నర్ చదవలేదు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ జోక్యం చేసుకుని, ప్రభుత్వం తయారు చేసిన గవర్నర్ ప్రసంగం మాత్రమే రికార్డుల్లో నమోదుకావాలని ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో సభ ముగిసే ముందు వినిపించే జాతీయ గీతాన్ని వినిపించకముందే సభ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు.

తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వివాదం గత కొన్ని నెలల నుంచి సాగుతోంది. గవర్నర్ గత వారం మాట్లాడుతూ, దేశం మొత్తానికి వర్తించేదానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రతిదానినీ చెడు అలవాటుతో తిరస్కరించే తిరోగమన రాజకీయాలు రాష్ట్రంలో ఉన్నాయని ఆరోపించారు. తమిళనాడు పేరును మార్చాలన్నారు. రాష్ట్రానికి తమిళనాడు కన్నా తమిళగం అనే పేరు ఎంతో తగినది అవుతుందని చెప్పారు. తమిళంలో ‘నాడు’ అంటే దేశమని చెప్పారు. ద్రావిడులమని చెప్పుకుంటూ తమిళనాడులో తిరోగమన రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే తదితర పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అయితే బీజేపీ మాత్రం గవర్నర్ వ్యాఖ్యలను సమర్థించింది. తమిళనాడు గడ్డను తమిళ సాహిత్యంలో తమిళగం అని, తమిళనాడు అని పేర్కొన్నారని తెలిపింది.

తమిళనాడు పేరును మార్చాలని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను డీఎంకే మిత్ర పక్షాలు సీపీఐ, సీపీఎం, వీసీకే, కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి. సోమవారం శాసన సభలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ఈ పార్టీల ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Updated Date - 2023-01-09T14:14:41+05:30 IST